షార్‌లోకి చొరబడ్డ తమిళనాడు వ్యక్తి.. అరెస్ట్‌

28 May, 2016 21:41 IST|Sakshi

 సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో శనివారం ఎలాంటి అనుమతి లేకుండా మూలస్థానేశ్వరస్వామి ఆలయం సమీపంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడుతూ భద్రతా సిబ్బందికి కనిపించాడు. తమిళనాడు సేలంకు చెందిన వెంకటేశన్ అనే వ్యక్తిని సీఐఎస్‌ఎప్ భద్రతా సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడకు ఎందుకొచ్చావ్ అని అతడ్ని భద్రతా సిబ్బంది, పోలీసులు ప్రశ్నించగా ఇక్కడ చేపల విక్రయాలు చేస్తుండడం చూశానని, తనకు చేపలు పట్టడం వచ్చినందున పులికాట్ జాలర్లతో తీరప్రాంతానికి చేరుకున్నాని తెలిపాడు. కొంతమంది జాలర్లతో కలసి పడవలో ఎక్కి బకింగ్ హాం కెనాల్ చేరుకున్నానని పేర్కొన్నాడు.

అతను చెప్పిన కథనమంతా నమ్మశక్యంగా లేకపోవడంతో ఇన్‌చార్జి సీఐ అక్కేశ్వరరావు, శ్రీహరికోట ఎస్సై విజయ్‌కుమార్, షార్ భద్రతా సిబ్బంది, షార్ ఇంటిలిజెన్స్ సిబ్బంది కలిసి వెంకటేశన్‌ను తీసుకుని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. షార్‌లోకి ఎలా చొరబడ్డాడు? అనే విషయంపై విచారణ చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి హిందీ, తమిళం మాట్లాడటం, అన్ని తెలిసిన వ్యక్తిగా ఉండడంతో లోతుగా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

 

మరిన్ని వార్తలు