టంగుటూరి ప్రకాశం.. ఆదర్శం

24 Aug, 2016 01:41 IST|Sakshi
టంగుటూరి ప్రకాశం.. ఆదర్శం
కర్నూలు(అగ్రికల్చర్‌): టంగూటూరి ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితాన్ని, ఆయన పట్టుదల, అకుంటిత దీక్షను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు పేర్కొన్నారు. మంగళవారం టంగుటూరి 145వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టుంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో అనంతరం కర్నూలు బాలభవన్, నంద్యాల గురురాజ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ సందర్బంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఒంగోలు జిల్లాకు చెందిన వారయిన వెనుకబడిన కర్నూలును ఆంధ్రరాష్ట్రానికి రాజధానిని చేయడంలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కర్నూలు అభివద్ధికి పునాది వేశారన్నారు. జమిందారి వ్యవస్థను రద్దు చేసి పలు శాశ్వత పనులు చేసిన ఘనత ఆయనదేనన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడిన మహామనిషిగా కొనియాడారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇస్తుందన్నారు. కర్నూలులో టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఏఓ తహేరా సుల్తానా, తెలుగు బాష వికాశ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంటు డాక్టర్‌ వీరస్వామి, ప్రముఖ రచయిత ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, కళాకారుడు ఇనయతుల్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
 
మరిన్ని వార్తలు