మహిమాన్వితుడు తంటికొండ వెంకన్న

5 May, 2017 23:18 IST|Sakshi
గోకవరం(జగ్గంపేట) :
మండలంలోని తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొండపై స్వయంభువుడుగా వెలసిన స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందాడు. ప్రహ్లాదుని మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారం ధరించాడు. స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిగోళ్లను ఆ హరిద్వేషిని అంతమొందిచాక మహారౌద్ర రూపంలో కొండలు కోనలు తిరిగాడు. ఆ సమయంలో తంటికొండను పావనం చేసి ఉండవచ్చని భక్తుల నమ్మకం. ఏటా భక్తుల రాకతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మ¯ŒS బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ బీడీపీ రామారావుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్థల పురాణం : స్థానిక ఐతిహ్యం ప్రకారం.. పూర్వం గ్రామంలో ఉన్న కొండపై దివ్యతేజస్సు కనిపించేది. అక్కడికి వెళ్లాలంటే జనానికి జంకు. ఆ కాంతి తమను భస్మం చేస్తుందేమోనన్న భయం. తరువాత కాలంలో కొందరు యువకులు ధైర్యం చేసి నిత్యం కనిపించే తేజస్సు కోసం కొండంతా గాలించగా దివ్యకాంతితో అలరారుతున్న పాదముద్ర దర్శనమిచ్చింది. నిర్మానుష్యమైన కొండపై కాలిగుర్తు కనిపించడం దైవసంకల్పమని భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ భక్తుడి కలలో కనిపించి ‘నేను నారసింహుడి అవతారంలో ఈ కొండపై సంచరించాను. అప్పుడే ఆ పాదముద్ర పడింది. ఈ ప్రాంతం భవిష్యత్తులో మహిమాన్విత క్షేత్రమవుతుందని, ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయం నిర్మించండి’ అని ఆదేశించాడు. మరోచోట ఆవు కాళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి గోరూపంలో సంచరిస్తుండగా ఆ గుర్తులు పడ్డాయని భక్తుల భావన. 1961లో కొండపై ఆలయ నిర్మాణానికి ప్రతిష్ఠ జరిపారు. నాటి నుంచి నేటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.
 
మరిన్ని వార్తలు