టీబీజీకేఎస్‌ది నమ్మకద్రోహం

5 Aug, 2016 17:56 IST|Sakshi
మాట్లాడుతున్న రియాజ్‌అహ్మద్‌
  •  హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ 
  • బెల్లంపల్లి : సింగరేణి కార్మికులను టీబీజీకేఎస్‌ నమ్మించి మోసం చేసిందని సింగరేణి మైనర్స్, ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లిలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
    ఎంతో నమ్మకంతో కార్మికులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)కు ఓట్లు వేసి గెలిపిస్తే నాలుగేళ్ల కాలంలో ఏ సమస్య పరిష్కరించలేదన్నారు. నమ్మిన కార్మికులను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. కార్మికులకు రెండు పడక గదుల ఇళ్లు, సకల జనుల సమ్మె వేతనం, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ వంటి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. టీబీజీకేఎస్‌ అగ్ర నాయకత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్‌ మాట్లాడటం లేదన్నారు. మరోమారు కార్మికులను మోసం చేయడానికి ఎన్నో డ్రామాలు ఆడుతోందన్నారు. టీబీజీకేఎస్‌కు గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని ఆ సంఘం నేతలు గనులపైకి రాకుండా కార్మికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
     
            ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కార్మిక సమస్యలపై ఏనాడు పోరాడింది లేదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడకుండా మెడికల్‌ బోర్డులో అన్‌ఫిట్‌ కేసులు చేయించి రూ.లక్షలు దండుకున్నారని ఆరోపించారు. వీరిని చూసిన టీబీజీకేఎస్‌లోని రెండు వర్గాల అగ్రనాయకులు కూడా అదే దందాను కొనసాగించి భ్రష్టు పట్టించారన్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం ఏ ఒక్క సంఘం కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. కార్మికుల పక్షాన పోరాడిన తనను 324 రోజులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారని, గోదావరిఖనిలో హెచ్‌ఎంఎస్‌ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు. టీబీజీకేఎస్‌ గుర్తింపు కాలపరిమితి ఈ నెల 6వ తేదీతో పూర్తవుతుందని ఆ తర్వాత యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని కోరారు. సమావేశంలో సింగరేణి మైనర్స్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ బెల్లంపల్లి రీజియన్‌ ఉపాధ్యక్షుడు టి.మణిరాంసింగ్, కేంద్ర కార్యదర్శి బి.రమణరావు, నాయకులు ఎండీ ఓజీయార్, అబ్దుల్‌ఖాదర్, సంజీవ్, ఎం.సత్యనారాయణ, ఎం.రాజన్న ఉన్నారు. 
    టీబీజీకేఎస్, నమ్మకద్రోహం, హెచ్‌ఎంఎస్‌ tbgks,cheting, hms
     
     
మరిన్ని వార్తలు