టీడీపీ వారి కాసుల పథకం..!

15 Jul, 2017 04:02 IST|Sakshi
టీడీపీ వారి కాసుల పథకం..!

లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు..
వితంతువులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని ప్రచారం
మాయమాటలు చెప్పి డబ్బు దండుకున్న టీడీపీ నాయకులు


నగరంపాలెం (గుంటూరు) : పథకం అమలు చేయడంలో గతంలో ఎన్నో స్కాములు చూసుంటాం.. కానీ అసలు అమలుకాని పథకానికి లబ్ధి చేకూరుస్తామని డబ్బులు దండుకున్నారీ ఘనులు. ఈ విషయం శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థలో వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ సాంఘిక కుటుంబ ప్రయోజన (ఎన్‌.ఎస్‌.బి.ఎఫ్‌) పథకం ద్వారా వితంతువులకు పింఛను అందించేది. అయితే.. కొంతకాలం తర్వాత పథకాన్ని నిలిపివేసింది.

ప్రస్తుతం ఆ పథకం అమలు కానుందని, పథకం వర్తించేలా చేస్తామని కొందరు టీడీపీ నాయకులు వందలాది మంది మహిళల నుంచి డబ్బు దండుకున్నారు. సదరు మహిళలు ఉపా(మెప్మా పరిధిలోని ఓ విభాగం)  సెల్‌ సిబ్బందికి దరఖాస్తులు అందిచడానికి వచ్చారు. సిబ్బంది నగరపాలక సంస్థకు సంబంధించి దరఖాస్తులన్నీ సిటిజన్‌ చార్టర్‌ కౌంటర్‌ ద్వారా తీసుకుంటారని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. ఉపా సెల్‌ సిబ్బంది చెప్పారని  సిటిజన్‌ కౌంటర్‌ సిబ్బందికి చెప్పడంతో వారు కూడా దరఖాస్తులు తీసుకున్నారు.

ఆశ చూపి.. డబ్బులు లాగి..
పింఛన్ల దరఖాస్తుల గురించి తెలుసుకున్న టీడీపీ నాయకులు పథకం ద్వారా ఒక్కో మహిళకు రూ.20 వేల వరకూ లబ్ధి చేకూరుతుందని, పథకం వర్తించాలంటే జన్మభూమి కమిటీ నాయకుల సిఫారస్‌ తప్పనిసరి అని మాయమాటలు చెప్పారు. దరఖాస్తులపై ఎమ్మెల్యే లేదా టీడీపీ నాయకుల సంతకాలు ఉంటేనే మంజూరు చేస్తారని వసూళ్లు ప్రారంభించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.500 చొప్పున, పథక లబ్ధికి మరో రూ.1500 చొప్పన వసూళ్లకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో మహిళలు దరఖాస్తులు అందించడానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి రాగా అసలు విషయం బయటపడింది.  

కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన
వైఎస్సార్‌ సీపీ నేతలు

వసూళ్ల పర్వంపై వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇన్‌చార్జి కమిషనర్‌ చల్లా అనూరాధకు ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌ అనూరాధ సిటిజన్‌ కౌంటర్‌ వద్దకు డిప్యూటీ కమిషనర్‌ ఏసుదాసును పంపి ఆరా తీశారు. ప్రస్తుతం పథకం అమలులో లేదని దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేయాలని సూచించారు. దీంతో అధికారులు దరఖాస్తులు స్వీకరించడం నిలిపివేశారు. దరఖాస్తులు అందజేయడానికి వచ్చిన మహిళలు ఆందోళన చేపట్టారు. పథకం అమలులో లేనప్పుడు దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. అధికారులు లాలాపేట పోలీసుల సాయం కోరడంతో వారు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

మహిళల ఆందోళన విషయం తెలుసుకున్నవైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ నాయకుడు పల్లపు శివతో పాటు మరి కొంతమంది నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి ఇన్‌చార్జి కమిషనర్‌ చల్లా అనూరాధతో మాట్లాడారు.  దీనికి కారణమైన సిబ్బందిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇన్‌చార్జి కమిషనర్‌ చల్లా అనూరాధ స్పందిస్తూ కింది స్థాయి ఉద్యోగులు తెలియక దరఖాస్తులు స్వీకరించారని, ప్రస్తుతం పథకం అమలు లేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణ జరగదన్నారు.

మరిన్ని వార్తలు