‘సీఎంను కలిశాం.. మంత్రులతో మనకేంటి’

3 Jan, 2016 00:31 IST|Sakshi
‘సీఎంను కలిశాం.. మంత్రులతో మనకేంటి’

 ‘సంక్రాంతి పండక్కి కోడిపందాలు వేయకుండా ఎవడ్రా మనల్ని ఆపేది. పండగ వరకు మీ ఇష్టమొచ్చినట్టు  ఆడుకోండి.. నేను చూసుకుంటా..’ పందేల రాయుళ్లకు టీడీపీ ప్రజాప్రతినిధి ఇచ్చిన భరోసా ఇది.
 
 పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల లింగారెడ్డి నాలుగు రోజుల క్రితం ఏలూరు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ అధికారులతో మాట్లాడిన అనంతరం తిరిగి వెళ్తుండగా.. పౌర సరఫరాల శాఖ గోడౌన్ల పరిసరాల్లోని యువకులు వారి వద్దకు వచ్చారు. ‘సార్.. ఈసారి కోడిపందాల పరిస్థితి ఏమిటి. పోలీసులతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా’ అని ఆ ప్రజాప్రతినిధిని అడిగారు.
 
 ఆయన ‘ఆడుకోండ్రా. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి’ అని అభయం ఇచ్చేశారు. కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని ఓ పక్క పోలీసు అధికారులు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో  వాస్తవ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఆ ఘటనే నిదర్శనం. వాస్తవానికి ఆ ప్రజాప్రజానిధి ఇలాకాలో ఎప్పటి నుంచో కోడిపందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్కడే కాదు.. ఏలూరు నగరం చాటపర్రు రోడ్డులోని ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి షెడ్డులోనూ జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు.
 
 భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం ప్రాంతంలోను, రూరల్ మండలం వెంప, లోసరి, వీరవాసరం మండలం కొణితి వాడ, నౌడూరు జంక్షన్లలో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడిపందేలు ఆడిన, ఆడించిన చరిత్ర ఉన్న నేతలను బైండోవర్ చేయాల్సిందిగా జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలిస్తే.. ఆ నోటీసులను పందెగాళ్లకు ఇచ్చే ధైర్యం కూడా ఖాకీలు చేయలేకపోతున్నారు. సంప్రదాయాల ముసుగులో విష సంస్కృతికి బీజం వేస్తున్న అధికార పార్టీ నేతలను అడ్డుకునే దమ్ము, ధైర్యంలేని పరిస్థితి చూస్తుంటేనే.. ఈసారి కళ్లెం లేకుండా పందెంకోళ్లు విచ్చలవిడిగా ఎగురుతాయని అర్థమవుతోంది.

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు  చెప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఉన్నతాధికారులు విజయవాడకు తరలిరాగా, స్వయంగా చంద్రబాబే మన జిల్లాకు రావడంతో ఇక్కడ అధికారులు ఖుషీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం వచ్చిన సీఎంను జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొత్త సంవత్సరం తొలి రోజు జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావును జిల్లాస్థాయి అధికారులెవరూ పట్టించుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఉండే మాణిక్యాలరావు సీఎం పర్యటనలో పాల్గొనేందుకు ఏలూరు రావడంతో.. ఎదురుపడినప్పుడు మొక్కుబడి శుభాకాంక్షలు చెప్పిన అధికారులు ఇక్కడే నివాసముంటున్న పీతల సుజాత వద్దకు పలకరింపునకు కూడా వెళ్లలేదు.
 
  కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తోపాటు.. చివరకు ఆర్డీవో కూడా మంత్రిని కూడా కలి సేందుకు రాలేదని పీతల వర్గీయులు మదనపడుతున్నారు. ఇతర జిల్లాల మంత్రులు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు జిల్లాలోని మంత్రులను జనవరి 1న మర్యాదపూర్వకంగా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దళిత మంత్రి కాబట్టే సుజాతను గౌరవించడం లేదని ఆమె వర్గీయులు, భాజపాకు చెందిన మంత్రి కాబట్టే పైడికొండలను పట్టించుకోవడం లేదని కమల నాథులు పేర్కొంటున్నారు. ఆ వర్గాల వాదనలు ఎలా ఉన్నా.. వారానికోసారి  ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నేరుగా అధికారులతోనే మాట్లాడుతుంటే.. మంత్రులకు ప్రొటోకాల్ ఏమిటన్న భావన అధికార వర్గాలకు వచ్చేసిందన్నది ఎవరు ఔనన్నా.. కాదన్నా తిరుగులేని వాస్తవం.
 

మరిన్ని వార్తలు