సరి'హద్దు' మీరిన దాదాగిరీ

1 Jul, 2016 08:28 IST|Sakshi

మూడున్నర దశాబ్దాలకు పైగా తునిలో తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం
ఆర్థిక మంత్రి యనమల సోదరుడు కృష్ణుడిపై ఆరోపణలు
విశాఖ జిల్లా పాల్మన్‌పేటలో దాడి ఆయన ప్రోద్బలంతోనే అంటున్న బాధితులు
 
 
కాకినాడ : మూడు దశాబ్దాలకు పైగా తుని ప్రాంతంలో చక్రం తిప్పుతున్న తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు సరి‘హద్దు’ మీరాయి. మంగళవారం విశాఖ జిల్లా పాల్మన్‌పేటపై విరుచుకుపడి, విధ్వంసం సృష్టించడానికి సూత్రధారి తుని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి వరుసకుసోదరుడైన యనమల కృష్ణుడేనన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.

పాల్మన్‌పేట దాడిలో బాధితులైన మత్స్యకారులు గురువారం తుని వద్ద హైవేపై బైఠారుుంచి ఆందోళన చేసిన సందర్భంగా ఇదే ఆరోపణ చేశారు. ‘కృష్ణుడు డౌన్‌డౌన్’ అని నినదించడం, కృష్ణుని ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఎలుగెత్తడం గమనార్హం. ఇదే విషయాన్ని పాల్మన్‌పేట బాధితులు పాయకరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణుడు రాష్ట్ర వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. తుని ఏఎంసీ చైర్మన్ అయిన కృష్ణుడే నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తూంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. 2009లో ఓటమి తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న రామకృష్ణుడు అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు.

గత ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ తరఫున తలపడ్డ కృష్ణుడు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యూరు. అయినా.. సోదరుడు మంత్రి కావడంతో ఆయన పెత్తనానికి అడ్డు లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంతవరకూ తుని నియోజకవర్గానికే పరిమితమైన తెలుగు తమ్ముళ్ల దాష్టీకం, దౌర్జన్యాలు ఇప్పుడు సరిహద్దు దాటాయనడానికి పాల్మన్‌పేట ఘటనే ఉదాహరణ.
 
ముఖ్యనేత ఉన్నారన్న భరోసాతోనే..
యువకుల క్రికెట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తునికి చెందిన తెలుగు తమ్ముళ్లు మారణాయుధాలతో పాల్మన్‌పేటవాసులపై దాడికి తెగబడ్డారు. తునిలోని వేమవరం, గొల్లముసలయ్యపేట, యాదాలవారివీధి, కుమ్మరిపేట మంత్రి రామకృష్ణుడికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామాలు. విశాఖకు చెందిన రాజయ్యపేట గ్రామస్తులకు మద్దతుగా పై నాలుగు గ్రామాల నుంచి ఐదారు వందల మంది తెలుగు తమ్ముళ్లు బరిసెలు, బల్లేలతో పాల్మన్‌పేటపై దాడులకు తెగబడ్డారు. కృష్ణుడి ప్రోద్బలం, ముఖ్యనేత చూసుకుంటారన్న భరోసాతోనే తెలుగు తమ్ముళ్లు ఇంతకు బరి తెగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
 
2014లో హేచరీస్‌లో విధ్వంసం
నియోజకవర్గంలో సముద్రతీరంలో ఉన్న హేచరీలపై చెన్నై నుంచి అధికారులు దాడులకు రాకుండా చూసుకుంటామని, అందుకు రూ.20 లక్షలు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు 2014లో డిమాండ్ చేశారు. ప్రియాంక హేచరీస్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఎవరికీ సొమ్ము ఇవ్వనవసరం లేదని నిరాకరించడంతో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు 2014 డిసెంబరులో ఆ హేచరీపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి కృష్ణుడే కారణమని, ఆయన నుంచి ప్రాణహాని ఉందని హేచరీస్ యజమాని అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

జోక్యం చేసుకున్న టీడీపీ  ముఖ్యులు రాజీ చేశారు. అప్పుడు హేచరీస్ యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వడమే దాడులకు కారణం కాగా.. ఇప్పుడు పాల్మన్‌పేటపై దాడికి కూడా వారు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణమైంది. ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే చట్టాన్ని తెలుగు తమ్ముళ్లు పెరట్లో రాటకు కట్టేసిన పశువును చేశారనే విషయం స్పష్టమవుతోంది.
 
అక్రమ ఇసుకదందా
తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ దందాతో లక్షలు కొల్లగొట్టారు. 2015 మార్చి నుంచి తుని, కోటనందూరు మండలాల్లో బొద్దవరం, డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. కొండల మధ్య వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసి వ్యాపారం నిర్వహిస్తుండగా, స్థానికుల సహకారంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రెడ్‌హేండెడ్‌గా పట్టిచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లకు భయపడ్డ అధికారులు కేసును నీరుగార్చారు.
 
వైఎస్సార్‌సీపీ వారిపై కక్షతో కేసులు
కాగా వైఎస్సార్ సీపీలో చురుకుగా ఉన్నవారిపైనా తెలుగు తమ్ముళ్లు కక్ష కడుతున్నారు. తుని కాపు ఐక్యగర్జన ఘటనలతో సంబంధం లేనివారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. బిళ్లనందూరుకు చెందిన లగుడు శ్రీనును అలాగే తుని కేసులో ఇరికించారని బంధువులు ఆవేదన చెందుతున్నారు. తమ మాట వినని, వైఎసార్‌సీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ, సొసైటీ అధ్యక్షుడు గొర్లె రామచంద్రరావు, భీమవరపుకోట సర్పంచ్ జిగటాల వీరబాబు.. ఇలా 70 మందికి పైబడి నేతలు, కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు తెలుగు తమ్ముళ్ల వేధింపులకు సాక్ష్యం.
 
చివరకు ఒంటిమామిడిలో పోలీసు క్వార్టర్ల కోసం కేటాయించిన లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కూడా తెలుగు తమ్ముళ్లు కబళించారంటున్నారు. బడా కంపెనీల పారిశ్రామిక అవసరాల కోసం రైతుల అభీష్టానికి భిన్నంగా బలవంతపు భూ సేకరణలో కూడా తెలుగు తమ్ముళ్లదే హవా.

అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అసైన్డ్ ల్యాండ్స్, డి ఫాం పట్టాల అమ్మకాలు...ఇలా తుని నియోజకవర్గంలో వారి అక్రమాలు, ఆగడాల జాబితా కొండవీటి చేంతాడంత ఉంటుంది. ఈ దందాకు అడ్డుకట్ట పడేదెప్పుడా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూంటే.. ఇప్పుడది సరిహద్దులు కూడా దాటడంతో గగ్గోలు పెట్టడం పాల్మన్‌పేటవాసుల వంతైంది.
 
 ప్రాతినిధ్యం ఎవరిదైనా పెత్తనం ‘తమ్ముళ్ల’దే..
 ఇప్పుడంటే తుని తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం సరిహద్దు దాటడం సంచలనమైంది. కానీ.. నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఆగడాలు నిత్యకృత్యం.  టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ తుని, పరిసర ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ల దాదాగిరీ బరితెగించడం ప్రజలకు తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా ఇదే ప్రధాన కారణం. అయినా పార్టీ అధికారంలో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు ఆ సంస్కృతిని విడనాడకపోగా మరింత పేట్రేగిపోతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేయే అయినా.. తెలుగుతమ్ముళ్ల ఇష్టారాజ్యమే నియోజకవర్గంలో సాగుతోంది. అందుకు ఉదాహరణలకూ కొదవ లేదు.

మరిన్ని వార్తలు