టెండర్లలో టీడీపీ దౌర్జన్యం

30 Dec, 2015 09:44 IST|Sakshi
రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న రామకృష్ణ ఇన్‌ఫ్రా ప్రై వేటు లిమిటెడ్ ప్రతినిధి సత్యనారాయణ

నరసరావుపేట వెస్ట్: అధికారం మదే కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే విధంగా ఉంది అధికార పార్టీ శ్రేణుల వ్యవహారం. రోడ్డు నిర్మాణ పనుల కోసం టెండరు దాఖలు చేసేందుకు వెళ్తున్న వ్యక్తిని అడ్డుకుని, అతని వద్ద ఉన్న పత్రాలు లాక్కొని వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం నరసరావుపేట రూరల్ పరిధిలోని లింగంగుంట్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్పీ) కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. నాగార్జునసాగర్ విజయపురిసౌత్ హిల్ కాలనీ నుంచి గుంటూరు జిల్లా వైపు సీసీ రోడ్డు, తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.06 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది.

ఈ పనులకు టెండర్లు దాఖలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన రామకష్ణా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పి.సత్యనారాయణ మంగళవారం ఎన్‌ఎస్సీ కార్యాలయానికి వస్తుండగా, మాచర్ల తెలుగుదేశం పార్టీకి చెందిన కె.చలమారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి, మరో వ్యక్తి లక్ష్మీరెడ్డి, 20 మందితో కలిసొచ్చి అడ్డుకున్నారు. కార్యాలయం మెట్లు ఎక్కుతున్న సత్యనారాయణ చేతిలోని పత్రాలను లాక్కెళ్లిపోయారు.  

 పత్రాలు ఇవ్వడానికీ జాప్యం చేశారు: బాధితుడు
టెండరు పత్రాలు అపహరించిన విషయంపై బాధితుడు నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెండరు పత్రాలు ఇచ్చే విషయంలో కూడా జాప్యం చేశారని ఆరోపించారు. టెండర్ల విషయం లోనే దౌర్జన్యం చేస్తే, పనులు దక్కించుకుంటే ఇంకెంత అరాచకానికి పాల్పడతారోనని ఆందోళన వ్యక్తం చేశారు.  

రెండు ఫారాలే దాఖలయ్యాయి
తమ కార్యాలయం నుంచి ఆరు టెండర్ ఫారాలను కొనుగోలు చేశారు. నిర్ణీత సమయంలో రెండు ఫారాలు బాక్సులో దాఖలయ్యాయి. టెండర్లు దాఖలు నేపథ్యంలో ఇద్దరు పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. ఎస్‌ఈ కష్ణారావు లేనందున వాటిని బుధవారం తెరుస్తాం.           
 - జి.మధుసూదనరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్

మరిన్ని వార్తలు