‘తమ్ముళ్ల’ పోరుబాట

22 Nov, 2016 01:35 IST|Sakshi
నేడు రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన... 
 రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర
 ‘కంచర్ల’ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి
 
 సాక్షి, నల్లగొండ : తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ జిల్లాలో ‘తమ్ముళ్ల’ను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇప్పుడు చెప్పుకునే స్థాయిలో కూడా కార్యకర్తలు, నేతలు లేక ప్రశ్నార్థకంగా మారిన పార్టీకి జిల్లాలో నూతన జవసత్వాలు నింపాలన్న వ్యూహంతో ‘రైతు పోరుబాట’ పేరిట కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నారు.
 
  ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తి కాగా, ఐదో యాత్రకు జిల్లాలోని నల్లగొండ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ముందుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో చిట్యాల మండలం వెలిమినేడులో దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నార్కట్‌పల్లికి చేరుకుని పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ వరకు ఆయన పాదయాత్ర ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
 ఈ బహిరంగసభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యు లు మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ బహిరంగసభ కోసం మునుగోడు, న కిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. అయితే, ఈ బహిరంగసభ ద్వారా రైతుల సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును ప్రజలకు తెలియపరిచి చైతన్యవంతులను చేసేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని వారంటుంటే... అధికార టీఆర్‌ఎస్ నేతలు మాత్రం టీడీపీ యాత్రను విమర్శిస్తున్నారు.
 
  తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించేందుకే ఈ యాత్రలు చేస్తున్నారని, తద్వారా అధికార పార్టీని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో ైరె తుయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌లో కూడా అగ్గి రాజేశాయి. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా స్పందించి రేవంత్‌ను తూర్పారబట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ నల్లగొండ కేంద్రంగా రేవంత్‌రెడ్డి అండ్ టీం అధికార టీఆర్‌ఎస్‌పై ఏ వ్యాఖ్యలు చేస్తారో, ఆ తర్వాత టీఆర్‌ఎస్ నేతలు ఏం స్పందిస్తారో అనే ఆసక్తి జిల్లా రాజకీయ వర్గాల్లో నెలకొంది.
 
 విజయవంతం చేయాలి
 ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను మరింత మోసం చేస్తున్నారు. ఆయన నిర్వాకాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే మా పార్టీ ఆధ్వర్యంలో రైతుపోరుబాట నిర్వహించి వారి పక్షాన నిలబడుతున్నాం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు,కార్యకర్తలు, ప్రజలు కలిసి విజయవంతం చేయాలి.’
 - కంచర్ల భూపాల్‌రెడ్డి,                       టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
>
మరిన్ని వార్తలు