మరో వికెట్‌ ఔట్‌ !

12 Dec, 2016 15:21 IST|Sakshi

– ఏడాదిగా బినామితో పని చేయిస్తున్న టీచర్‌
– డీఈఓ ఆకస్మిక తనిఖీలో బట్టబయలు
– సస్పెన్షన్‌ వేటు వేసిన డీఈఓ


అనంతపురం ఎడ్యుకేషన్‌/ నల్లమాడ : జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా వేళలు, చెప్పాపెట్టకుండా గైర్హాజరు అంశాలపై డేగకన్ను  ఉంచారు. ఈ క్రమంలోనే తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యవైఖరి అవలంభించే వారిపై ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నల్లమాడలో చాంప్లానాయక్‌ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్‌ చేశారు. డీఈఓ మంగళవారం ఉదయం 10.50 గంటలకు నల్లమాడ మండలం డి.రామాపురం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.

వాస్తవానికి ఇక్కడ చాంప్లానాయక్, రమాదేవి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. చాంప్లానాయక్‌ హెచ్‌ఎంగా ఉంటున్నారు. తోటి టీచరుకు ఆదర్శంగా ఉండాల్సిన ఈయన ఏడాదిగా అక్కడ తన స్థానంలో బినామీ టీచర్‌ (మహిళ)ను పెట్టాడు. డీఈఓ తనిఖీలో ఈయనతో పాటు బినామీ టీచరు దొరికిపోయారు. డీఈఓ గ్రామస్తులతో విచారించారు. ఏడాదిగా చాంప్లానాయక్‌ టీచర్‌ను చూడలేదని ఆయన స్థానంలో మరో మహిళ టీచరు వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో చాంప్లానాయక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు.   

>
మరిన్ని వార్తలు