పాఠశాల ఆవరణలోనే కాపురం

20 Jul, 2017 02:48 IST|Sakshi

కస్తూర్బా స్కూల్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్వాకం
సర్వశిక్ష అభియాన్‌ అధికారుల తనిఖీలో బట్టబయలు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు


రాజుపాలెం(సత్తెనపల్లి): రాజుపాలెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురం ఉంటున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభయాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ సిబ్బందిని ఆదేశించారు.  తెలుగు ఉపాధ్యాయిని అమృతవాణి, ప్రస్తుత ఇన్‌చార్జి, లెక్కల ఉపాధ్యాయిని నాగరాజకుమారి, ఏఎన్‌ఎం సుమన్, డే వాచ్‌మెన్‌ నాగమణి కొంత కాలం నుంచి పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురముంటున్నారని ముందస్తు సమాచారం అందడంతో ఆయన, సిబ్బందితో కలసి బుధవారం పాఠశాలలో తనిఖీ నిర్వహించారు.

ఎంఈవో మల్లికార్జునశర్మను ఫోన్‌ చేసి పాఠశాలకు రప్పించారు. ఆ నలుగురి కుటుంబాలు పాఠశాల ఆవరణలో కాపురముంటున్నట్టు నిర్థారణ కావడంతో ఆ నలుగురిపై ఎంఈవో సమక్షంలో ఎస్‌ఐ రమేష్‌కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పరిశీలించి కేసు నమోదు చేస్తానని ఎస్‌ఐ తెలిపారు.

నీళ్ల మజ్జిగ..నీళ్ల పప్పుచారు...
సర్వశిక్ష అభయాన్‌ బృందం పాఠశాలలో భోజనాన్ని పరిశీలించింది.  పప్పుచారు,  మజ్జిగ  నీళ్లలా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విచారణలో తేలడంతో సిబ్బందిపై మండిపడ్డారు.  రికార్డులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు