గోతులుపడ్డ రోడ్డే చెబుతోంది.. రూ. కోట్లు మింగేశారని..!

20 Jul, 2017 02:49 IST|Sakshi
గోతులుపడ్డ రోడ్డే చెబుతోంది.. రూ. కోట్లు మింగేశారని..!

వేసిన మూడు నెలల్లోనే మాయం
వాహన చోదకులకు నరకయాతన
నాలుగేళ్లుగా ఇదే తంతు
జీలుగుమిల్లి – దేవరపల్లి జాతీయ రహదారి కహాని


ఆ రోడ్డుకు కోట్ల రూపాయలతో  మరమ్మతులు చేశారు. కొంత దూరం కొత్త రోడ్డునూ వేశారు. అయితే చేసిన మరమ్మతులు, వేసిన కొత్త రోడ్డు.. రెండు రోజులుగా కురిసిన  వర్షానికి మాయమైపోయాయి. నాణ్యత లేకుండా పనులు చేశారని చెప్పడానికి రోడ్డుపై ఏర్పడిన గుంతలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ రహదారిపై ప్రయాణం ప్రస్తుతం వాహన చోదకులకు నరకప్రాయంగా మారింది.

ఏలూరు : దేవరపల్లి నుంచి జీలుగుమిల్లి వరకూ ఉన్న జాతీయ రహదారి గతుకుల మయంగా మారింది. గడచిన నాలుగేళ్లుగా తూతూ మంత్రంగా చేస్తున్న మరమ్మతులు చిన్న వానకే కొట్టుకుపోతున్నాయి. మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు మింగేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రోడ్డంతా గతుకులు మయంగా మారింది. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కొవ్వూరు మీదుగా దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా వెళ్తాయి. అక్కడి నుంచి అశ్వారావు పేట మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయి.

హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు ఎక్కువగా ఈ రహదారి గుండానే వెళ్తాయి.  బాగా రద్దీ ఉండే ఈ రహదారి  గోతులు మయంగా మారింది. గత ఏడాది ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణం అంటే నరకం చూశారు.  ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మతులు పూర్తి చేశారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి కొత్తగా వేసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. పూర్తి నాసిరకంగా వేయడంతో రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. ఇదే పరిస్థితి గత నాలుగేళ్లుగా జరుగుతోంది. జంగారెడ్డిగూడెం – జీలుగుమిల్లి మధ్యలో రోడ్డు మరమ్మతుల కోసం నాలుగేళ్లలో రూ. 25.64 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే అక్కడ జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.

భారీ వాహనాల కారణంగా రోడ్డు త్వరగా పాడైపోతోందని అధికారులు సాకులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో రిపేర్లు చేయడం వర్షాకాలం పూర్తికాక ముందే రోడ్డు దెబ్బతినడం ఆనవాయితీగా మారిపోయింది. 2013–14çలో రూ. 7.26 కోట్లు, 14–15లో కోటిన్నర, 15–16లో రూ. 8.19 కోట్లు. 16–17లో రూ. 8.73 కోట్లు మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.  జీలుగుమిల్లి మండలం మడకంవారి గూడెం ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేశారు.

ఈ రోడ్డు నెలరోజుల్లోనే పనికిరాకుండా పోయింది. మరమ్మతుల ముసుగులో అధికారులు, కాంట్రాక్టర్‌లు తూతూ మంత్రంగా నాణ్యత లేకుండా రోడ్డు పోసి నిధులు మింగేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డు వర్షం వస్తే బురుద మయంగా మారిపోతే, ఎండ ఉన్నప్పుడు దుమ్ముతో వాహనదారులకు నరకం కనపడుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్‌ దృష్టి పెట్టి ఈ అవినీతిని వెలికితీయాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
 

>
మరిన్ని వార్తలు