పరీక్షలు రాసిన కో ఆర్డినేటర్లు

22 Aug, 2016 00:52 IST|Sakshi
పరీక్షలు రాసిన కో ఆర్డినేటర్లు
సదాశివనగర్‌: గ్రామాల్లో పూర్తిగా అక్షరం ముక్కరాని వారికి అక్షరాలు నేర్పించి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2010లో సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ క్షేత్ర స్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో సాక్షర భారత్‌ కేంద్రాలు కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో అక్షరం ముక్క నేర్పిన సందర్భాలు లేవు. నామమాత్రంగా ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఎంత మంది నిరక్షరాస్యులు ఉన్నారో ప్రతి నెల మండల స్థాయి కో ఆర్డినేటర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నారే తప్ప ప్రయోజనం  లేకుండా పోతోంది.
సదాశివనగర్‌ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈనెల 21వ తేదీన మండలంలో 300 మందికి ఎన్‌ఐవోఎస్‌ టెస్ట్‌ను రాయించాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఆదేశం. ఇందుకు మండలంలోని కల్వరాల్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, మర్కల్, పోసానిపేట్, ఇసన్నపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఆదివారం 60 మంది చొప్పున నిరక్షరాస్యులకు పరీక్ష నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఏ గ్రామంలోనూ కేంద్రాల్లో నిరక్షరాస్యులు పరీక్షలు రాయలేదు. నేరుగా సంబంధిత గ్రామస్థాయి కో ఆర్డినేటర్లే ప్రశ్నపత్రాలను నింపారు. మరికొంత మంది కో ఆర్డినేటర్‌లు టెన్త్, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులతో పరీక్షలు రాయించడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆశయం నేరవేర్చే దిశగా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 
 
21వైఎల్‌ఆర్‌152: సదాశివనగర్‌ మండలం మర్కల్‌లో పరీక్షను రాస్తున్న గ్రామస్థాయి కో ఆర్డినేటర్లు
 

 

మరిన్ని వార్తలు