నగదు బదిలీల అమలులో కేస్ స్టడీగా కృష్ణా

9 Sep, 2016 19:11 IST|Sakshi

 జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధన పాలక సంస్థ (ఎన్.సి.ఎఫ్.ఎ.ఇ.ఆర్) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అమలుచేయాల్సిన నేరుగా నగదు బదిలీ పథకం అమలుకు కృష్ణా జిల్లాను సందర్భ పరిశీలనకు (కేస్‌స్టడీ) ఎంపిక చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఢిల్లీ నుంచి ఎన్.సి.ఎఫ్.ఎ.ఇ.ఆర్. నిర్వహించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ బాబు మాట్లాడుతూ నేరుగా నగదు బదలీ పథకం అమలులో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం కింద జిల్లాలో పూర్తి స్థాయిలో సీడింగ్ ప్రక్రియను పూర్తిచేశామన్నారు. లబ్ధిదారులకు బయోమెట్రిక్ ఫలవంతంగా కాని సందర్భంలో ఐరిస్ ద్వారా కూడా అందిస్తున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, గ్యాస్ సబ్సిడీ ఎరువుల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అంగన్‌వాడీ కేంద్రాల వరకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నామన్నారు. డీబీటీ విధానంలో ముఖ్యంగా వివిధ అంశాలు ప్రాధాన్యతగా గుర్తించామని చెప్పారు. సామాజిక భద్రత విదానం రాష్ట్ర స్థాయిలో ఇ-గవర్నెన్స్, ఇ-రెడినెస్ దశాబ్ది కాలంగా అమలు చర్యలు, నగదు బదిలీ విధానం ఆర్థిక లబ్ధి విధానంలో ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలు చర్చించినట్లు తెలిపారు. దేశంలో 20 రాష్ట్రాలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో కొన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ప్రతినిధులు చెప్పారని కలెక్టర్ వివరించారు. కృష్ణా జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు, పథకాల్లో నగదు లావాదేవీలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారన్నారు. ఈ పథకాలను పూర్తి స్థాయిలో అమలుకు నేరుగా నగదు బదిలీ విధానంలోనే నిర్వహించేందుకు కేస్‌స్టడీగా కృష్ణాజిల్లాను ఎంపిక చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంతోష్ మాథ్యూస్, డి.బి.టి. అధికారి పీయూష్ కుమార్, ఇతర బృందం సభ్యులు, విజయవాడ నుంచి డీడీవో అనంతకృష్ణ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు