యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

19 Jul, 2016 22:33 IST|Sakshi
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

 సీబీఐటీ, వీబీఐటీలో ఎస్‌కే యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజగోపాల్‌


చాపాడు:
ఒకప్పుడు విదేశీయులు ఎంతో మంది భారతదేశానికి వచ్చి చదువుకోవాలనే స్థాయిలో మన దేశం ఉండేదని.. ప్రస్తుతం ఇతర దేశాలకెళ్లి చదువుకోవాలనే విధంగా మన దేశస్తులు ఉన్నారని.. ఈ విధానానికి స్వస్తి పలికి మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు. స్థానిక చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(సీబీఐటీ), విజ్ఞానభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీబీఐటీ) కాలేజీలలో మంగళవారం ఎస్‌కే యూనివర్సిటీ వీసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల కోవలో ఉందని, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా యువతకే ఉందని, వీరిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న నీతి వాక్యాలను మరవకూడదని, వివేకానందుడి స్ఫూర్తితో చదువుకోవాలన్నారు.

చదువుతో పాటు విద్యార్థులకు తెలిసిన టెక్నాలజీని ఉపయోగిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందేందుకు ప్రతి విద్యార్థి ప్రయత్నించాలన్నారు. విద్యార్థి దశలో సబ్జెక్టు నాలెడ్జీతో పాటు ఇంటర్నెట్‌ సాయంతో అదనపు సిలబస్‌ను నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం వైస్‌ చాన్స్‌లర్‌ దంపతులను సీబీఐటీ, వీబీఐటీ యాజమాన్యం తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాళ్లు పాండురంగన్‌రవి, డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు యోగివేమన కాలేజీ ప్రిన్సిపాల్‌ జయరామిరెడ్డి పాల్గొన్నారు.
మొక్కలు నాటిన వీసీ దంపతులు
స్థానిక సీబీఐటీ, వీబీఐటీ కాలేజీ ఆవరణలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజగోపాల్‌ సతీసమేతంగా మొక్కలను నాటారు. పచ్చదనం పెంపొందించడం ఎంతో అవసరమని, మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు