రైతులందరికీ పాడి ప్రోత్సాహకం

8 Aug, 2016 19:51 IST|Sakshi

- త్వరలో నిర్ణయం... మంత్రి తలసాని వెల్లడి
- పశువ్యాధులు లేని ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్

 విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇతర రైతులందరికీ వర్తించేలా త్వరలో జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.

 

విజయ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 3.80 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు వాల్ పెయింటింగ్, హోర్డింగ్స్ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పిస్తామన్నారు. జాతీయ రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడు, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీని నివారించేందుకు ఫుడ్‌సేఫ్టీ, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

 

తెలంగాణను ఏ విధమైన పశు వ్యాధులు లేని ప్రాంతంగా పారిస్‌లోని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ గుర్తించిందని పశుసంవర్థకశాఖ వెల్లడించారు. ఆంత్రాక్స్, యాంటీరేబిస్ వంటి వ్యాక్సిన్లను వీబీఆర్‌ఐ ల్యాబ్‌లో అదనంగా తయారు చేసి రాష్ట్ర అవసరాలకే కాకుండా బయటి ప్రాంతాలకు విక్రయించే వెసులుబాటు కల్పించేలా నూతన ఫ్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ పాలిటెక్నిక్ పేరు మార్చి జిల్లాస్థాయి వెటర్నరీ ఆసుపత్రులుగా మార్చే ప్రతిపాదన ఉందన్నారు. మారుమూల గ్రామాల్లోని పశువులకు వైద్య సేవలు అందించేందుకు నియోజకవర్గానికి ఒక మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు తె లిపారు.

 

చేపల చెరువుల్లో ప్రభుత్వపరంగా నూటికి నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లల సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేజ్ కల్చర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పశుసంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు