మిగిలిన ఆ కాస్తా మింగేస్తాడేమో!

2 Dec, 2015 10:15 IST|Sakshi
ఆచంట వేమవరంలో నేలకొరిగిన చేలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన వర్షాలు.. రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని రైతన్నల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గత వారంలో కురిసిన వర్షాలతో ఐదు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోక మునుపే మంగళవారం తెల్లవారుజాము నుంచి చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అల్పపీడనం తీరం దాటే సమయానికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించడంతో ఈ ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు లేక ఎండిపోయింది ఎండిపోగా మిగిలిన పంట ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటోంది. ఈ సమయంలో వర్షం పడితే కంకుల్లోకి నీళ్లు పోయి తాలు వచ్చే ప్రమాదం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మరో 15 రోజుల్లో కోతకు వచ్చే పంటకు ముప్పు పొంచి ఉంది.

ఈదురు గాలులు వీచినా, భారీ వర్షాలు పడినా పంట నేలమట్టమవుతుంది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా పంటలు ధ్వంసమయ్యాయి. పండ్ల తోటలు తీవ్రంగా నష్టపోయాయి. నష్టపోగా మిగిలిన పంటల్ని, చేపల చెరువుల్ని కాపాడుకునే ప్రయత్నాల్లో రైతాంగం ఉన్న దశలోనే తిరిగి వానలు మొదలు కావడంతో రైతన్న తీవ్ర భయాందోళనకు గురవుతున్నాడు. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో కోస్తా ప్రత్యేకించి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి.  

మరిన్ని వార్తలు