బాబుపై కేసుకు నమోదుకు పోలీసుల తిరస్కరణ

21 Jan, 2017 00:05 IST|Sakshi
– గాంధీ విగ్రహానికి ఫిర్యాదు పత్రాన్ని ఇచ్చి నిరసన తెలిపిన వైఎస్‌ఆర్‌స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : 2014 సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేయడంపై వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో 1000–2000 మధ్య నిరుద్యోగభృతి ఇస్తామన్న హామీని అమలు చేయకపోవడంతో సీఎంపై ఐపీసీ సెక‌్షన్‌ 420, చీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తే త్రీటౌన్‌ పోలీసులు తిరస్కరించారు. తాము ఫిర్యాదును స్వీకరించలేమని, స్వీకరిస్తే అనేక సమస్యలు వస్తాయని పంపించేయడంతో కలెక్టరేట్‌ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి వారు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని విస్తృత ప్రచారం నిర్వహించారని, ఈ హామీ అమలుపై ఎన్నికల కమిషన్‌కు కూడా అనుమానం వచ్చి వివరణ కోరితే కచ్చితంగా ఇంటికో ఉద్యోగం లేదా రూ.1000–2000 మధ్య నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. వెంటనే  ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టుకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వలీ, పృథ్వీ, ప్రదీప్, సాయి, ఖాదర్‌వలీ, సాయిచరణ్, చైతన్య, భరత్, కిరణ్, రాజు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి పుల్లారెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు