పరుగులు పెట్టిన రైలు

16 Dec, 2016 23:29 IST|Sakshi
పరుగులు పెట్టిన రైలు
  • రాయదుర్గం–కళ్యాణదుర్గం మార్గంలో 110 కిలోమీటర్ల స్పీడ్‌తో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • వారం రోజుల్లోగా సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే జీఎంకు నివేదిక
  • నెలాఖరులోనే ప్యాసింజర్‌ రైలు నడిపే అవకాశం? 
  • రాయదుర్గం టౌన్‌:

    రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు నిర్మించిన కొత్త రైలు మార్గంలో ప్రత్యేక తనిఖీ రైలు శుక్రవారం అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా నడిపి పరీక్షించారు. ట్రయల్‌ రన్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైనట్లు రైల్వే సేఫ్టీ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల మధ్య దూరం గల ఈ మార్గంలో తొలుత రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి ఉదయం 9.30 గంటలకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రత్యేక రైలు కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు అదే వేగంతో ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు లేకుండా విజయవంతంగా రాయదుర్గం స్టేషన్‌కు వెళ్లింది. మొదటి రోజు ఆరు మోటార్‌ ట్రాలీలలో సీఆర్‌ఎస్‌ తనిఖీలు నిర్వహించిన సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే, రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు రెండో రోజైన శుక్రవారం ట్రయల్‌ రన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఇంజినీర్లను, రైలు గార్డులు, డ్రైవర్లు, అధికారులను అభినందించారు. రాయదుర్గం చేరుకున్న తరువాత విలేకర్లతో రైల్వే చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి అశోక్‌ గుప్తా, చీఫ్‌ సేఫ్టీ కమిషనర్‌ మనోహర్, ఏడీఆర్‌ఎం పునిత్‌ మాట్లాడారు. ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేశామని, ఆథరైజేషన్‌ నివేదికను వారం రోజుల్లోగా సౌత్‌వెస్ట్రన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌కు అందజేస్తామన్నారు. సేఫ్టీ తనిఖీల్లో అన్ని పారా మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ట్రయల్‌ రన్‌ విజయవంతమైందన్నారు. మార్గంలో రైలు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అన్ని రకాలుగా ట్రాక్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నెలాఖరులో లేదా జనవరిలో ఒక ప్యాసింజర్‌ రైలు నడిపించే అవకాశం ఉందన్నారు. రాయదుర్గం నుంచి టుంకూరుకు 207 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం వరకు రైలు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఆంధ్రా పరిధిలోని 94 కిలోమీటర్లకు గాను ఇంకా 23 కిలోమీటర్ల పరిధిలో భూమి అక్విజేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని, కర్ణాటక పరిధిలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు.

     

     

మరిన్ని వార్తలు