తెప్పపై కుమారస్వామి చిద్విలాసం

30 Jul, 2016 22:30 IST|Sakshi
తెప్పపై విహారం

కార్వేటినగరం : కార్వేటినగరం కుమారగిరిపై వెలసి ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. వళ్లీ దేవసేన సమేతంగా స్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో  ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. సాయంత్రం చాకలివానిగుంట ఎస్టీ కాలనీవాసులు ఆనవాయితీ ప్రకారం సారె సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చారు. పుర వీధుల్లో ఊరేగింపు అనంతరం పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అనంతరం తెప్పపై కొలువుదీర్చి వేదమంత్రోచ్చారణలు,మేళతాళాల నడుమ ఏడు సార్లు పుష్కరిణిలో ప్రదక్షిణ చేశారు. తెప్పను లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. తెపోత్సవాన్ని తిలకించేందుకు పలు మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ మోహన్, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు