దొంగలొచ్చారు.. దోచుకెళ్తారు!

7 Jul, 2017 01:41 IST|Sakshi
ఓ షాప్‌ చోరీలో దొంగలు తొలగించిన తాళం అవశేషాలు

రాజధానిలో యూపీ, బీహార్‌ ముఠాలు
శివారు కాలనీలే లక్ష్యంగా దొంగతనాలు
పక్కాగా రెక్కీ... చాకచక్యంగా తాళాలు ధ్వంసం
అడ్డొస్తే విచక్షణారహితంగా ఎదురు దాడే..!
వరుస దొంగతనాలతో ఆందోళనలో ప్రజలు
నిద్దరోతున్న రాత్రి గస్తీ


సాక్షి, అమరావతిబ్యూరో :
రాజధానిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. శివారు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. యూపీ, బీహార్‌లకు చెందిన దొంగల ముఠాలు అమరావతిపై ఏడాది కిందటే కన్నేశాయి. కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ ముఠాలు ఇక్కడికి వచ్చాయి. ఇళ్లలో దొంగతనాలతో సరిపెట్టుకోలేదు. జనసమూహం ఉండే ప్రదేశాల్లో బంగారు ఆభరణాలు, లగేజీ బ్యాగుల అపహరణతో హడలెత్తించారు. అప్పట్లో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. కొద్దికాలం వెనక్కి తగ్గిన ఆ ముఠాలు మళ్లీ రెండు నెలలుగా రాజధాని ప్రాంతంలో తమ తడాఖా చూపిస్తున్నాయి.

వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండటం వల్లే...
తాజా పరిణామాలతో అంతర్రాష్ట్ర దొంగల వ్యవహారాలపై విజయవాడ పోలీసులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, నెల్లూరులతోపాటు హైదరాబాద్‌ పోలీసులతో కూడా సంప్రదిస్తూ అక్కడ జరుగుతున్న దొంగతనాల తీరుతో పోల్చి చూస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులతో సంప్రదించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కూడా కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకు అమరావతిలో సంఘటనలకు మధ్య సారూప్యత ఉందని గుర్తించారు.

యూపీ, బీహార్‌లకు చెందిన దొంగలు తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలపైనే కన్నేశారని నిర్ధారించారు. దాదాపు 300 దొంగల కుటుంబాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నాయని గుర్తించారు. ఇక్కడ నిర్మాణ కార్యకలాపాలు, ఇతర వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండటమే ఇందుకు కారణమని తేలింది. దీంతోపాటు ఈ నగరాలను ఆనుకుని గ్రామీణ ప్రాంతాలు ఉండటం కూడా తమకు కలసివస్తుందని దొంగల ముఠాలు భావించాయి.

దశలవారీగా వస్తూ...
యూపీ, బీహార్‌ల నుంచి దొంగల ముఠాలు దశలవారీగా వచ్చి కొన్ని నెలలపాటు రాజధాని పరిధిలో ఉండి దొంగతనాలతో హల్‌చల్‌ చేయాలని నిర్ణయించుకున్నాయి. నిఘా తక్కువగా ఉండే శివారు కాలనీల్లో ఒకటికి రెండుసార్లు రెక్కీ నిర్వహించి పకడ్బందీగా దొంగతనాలను పాల్పడుతున్నాయి ఈ క్రమంలో కొందరు పోలీసులకు చిక్కినప్పటికీ ఇతర ముఠాలు వెనక్కి తగ్గకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా ఈ ముఠాలు సిద్ధపడి ఉంటాయని పోలీసుల విచారణలో వెల్లడికావడం కలవరపరుస్తోంది.

నిద్రమత్తులో నిఘా..
రాజధాని అమరావతి ప్రాంతంలో రాత్రిళ్లు భద్రత లోపభూయిష్టంగా ఉండటం దొంగలకు కలసివస్తోంది. విజయవాడలోగానీ శివారు కాలనీల్లో రాత్రి గస్తీ లేకుండాపోయింది. తగినంత మంది సిబ్బంది, వాహనాలు వంటి మౌలిక వ్యవస్థ లేకపోవడం వల్లే రాత్రి గస్తీ బలహీనపడిందని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల కోసం ఏడాదిన్నరగా అడుతున్నా... ఇప్పటికీ కూడా నిధులు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ, బీహార్‌ ముఠాలు రాజధానిలో తిష్టవేశాయన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పోలీసులు నిఘాను ముమ్మరం చేసి దొంగల ఆగడాలను ఆరికట్టాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు