ఒక్క బుక్కు వచ్చింటే ఒట్టు

3 Jun, 2016 04:09 IST|Sakshi
ఒక్క బుక్కు వచ్చింటే ఒట్టు

బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం
అందని పాఠ్యపుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు

 కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. సకాలంలో వారికి పాఠ్యపుస్తకాలు అందించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు  అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నారు. ఇంటర్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు  ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు తెరుచుకున్నాయి.  కానీ  అవసరమైన పాఠపుస్తకాలు మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 జిల్లావ్యాప్తంగా ఎన్ని పుస్తకాలు కావాలంటే
జిల్లావ్యాప్తంగా ఇంటర్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 1,00,118 పుస్తకాలు అవసరమని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదికిచ్చారు. అక్కడి నుంచి ఇంతవరకు అతీగతీ లేదు.

 నేరుగా గోడౌన్‌కు
ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటర్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నేరుగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు చేరుకుంటాయి. సంబంధిత పుస్తకాలను అక్కడి నుంచి ఆర్‌ఐవో కార్యాలయానికి తరలించుకుని ఇక్కడ నుంచి కళాశాలల వారికి పంపిణీ చేయనున్నారు. ఈ తతంగమంతా జరగాంటే కొంత సమయం పడే అవకాశాలున్నాయి.

 రాగానే పంపిణీ చేస్తాం
ప్రభుత్వం నుంచి పాఠపుస్తకాలు రాగానే కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. దాదాపుగా వారంలోపే పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాలు రాగానే అలస్యం లేకుండా కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రమౌళి, డివీఈవో, కడప.

మరిన్ని వార్తలు