అభివృద్ధిలో ముందుంటాం.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ముందుంటాం..

Published Fri, Jun 3 2016 4:09 AM

అభివృద్ధిలో ముందుంటాం.. - Sakshi

ఉద్యమంలో జిల్లాది విశిష్ట స్థానం
‘మిషన్’ పనుల్లో రాష్ట్రంలోనే ప్రథమం
రోడ్డు నెట్ వర్క్‌లో ముందంజలో నిలుస్తాం..
కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
‘బైపాస్’లో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్టాండ్
రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన మహత్తర ఉద్యమంలో జిల్లా విశిష్ట స్థానాన్ని ఆక్రమించి.. ఉద్యమాల ఖిల్లాగా పేరొందింది. 1969, జనవరి 8న ఖమ్మం నడిబొడ్డున అన్నాబత్తుల రవీంద్రనాథ్ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ.. చేపట్టిన దీక్షతో మొదలై మలివిడత ఉద్యమం వరకు జిల్లా మహోద్యమంలా పోరాడింది.తెలంగాణ త్యాగధనులకు స్మృత్యంజలి.. రాష్ట్ర సాధన ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు.. రాష్ట్ర ఫలాలు  మూడేళ్లలో జిల్లాలోని ప్రతి గడపకు అందేలా రెట్టింపు అభివృద్ధి చేస్తాం’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ద్వితీయ అవతరణ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి తీరును వివరిస్తూ చేసిన ప్రసంగం ఇలా..

 రాష్ట్రంలోనే ‘మిషన్’ నంబర్ వన్..
మిషన్ కాకతీయ కింద జిల్లాలో 4,517 చెరువులను ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత రూ.245కోట్లతో 851 చెరువు పనులు చేపడితే.. 801 పూర్తయ్యాయి. రెండో విడతలో రూ.323కోట్లతో 927 చెరువు పనులకు శ్రీకారం చుట్టాం. మొదటి, రెండో విడత పనుల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

 మిషన్ భగీరథకు రూ.3,558కోట్లు..
మిషన్ భగీరథతో జిల్లాలో 41 మండలాల్లోని 2,658 ఆవాసాలు, ఏడు మున్సిపాలిటీల్లోని 26.66 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.3,558కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు రూ.235కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోగా పాలేరు సెగ్మెంట్ పరిధిలో 78, వైరా పరిధిలో 17 గ్రామాలకు మంచినీటిని అందిస్తాం. వచ్చే ఏడాదిలోగా జిల్లాలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించి.. ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడుతాం.

 ‘భక్త రామదాసు’తో ఈ ఏడాదే సాగునీరు
నాగార్జున సాగర్‌తో సాగునీటి వసతి లేని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లోని 58,958 ఎకరాలకు సాగునీరు అందించేందుకు భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రూ.91 కోట్ల వ్యయంతో చేపట్టాం. పనులను ఈ ఏడాది పూర్తి చేసి.. సాగునీరు అందిస్తాం. అలాగే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ.7,926కోట్లతో తీసుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నాం. ఈ వారంలోనే టెండర్లు పిలిచి.. ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుడతాం. మణుగూరు సమీపంలో రూ.7,290కోట్లతో 1080 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. లోఓల్టేజీ సమస్యను నివారించి.. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. వ్యవసాయానికి పగటి పూట 6 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.

 రోడ్ల నిర్మాణానికి రూ.1,411కోట్లు..
జిల్లాలో 1,470 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి సంబంధించి 199 పనులకు ప్రభుత్వం రూ.1,411 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 105 పనులు పూర్తయ్యాయి. జిల్లాలో రెండు లేన్ల రహదారి లేని ఏడు మండలాలను జిల్లా కేంద్రంతో అనుసంధానం చేస్తున్నాం. విజయవాడ-జగదల్‌పూర్, కోదాడ-ఖమ్మం-మహబూబాబాద్ రోడ్లను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటికి సంబంధించి జిల్లాలో మొత్తం 181 కిలోమీటర్లున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట నుంచి అశ్వారావుపేట, వరంగల్-ఖమ్మం, సారపాక-ఏటూరునాగారం జాతీయ రహదారులుగా ప్రకటించింది. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలోనే జిల్లా రోడ్లు నెట్‌వర్క్‌లో ప్రథమ స్థానంలో నిలుస్తాయి.

 గ్రామీణ రోడ్లకు పెద్దపీట
గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లాలో 666 కిలోమీటర్ల మేర 193 పనులను రూ.103కోట్లతో చేపట్టాం. నాబార్డు ఆర్థిక సహాయంతో రూ.26కోట్లతో 16 వంతెనలు, రూ.17కోట్లతో 95 గ్రామ పంచాయతీ భవనాలు, మండల పరిషత్ కార్యాలయాలు నిర్మిస్తున్నాం. ఐటీడీఏ, ఎంపీ ల్యాడ్స్, గిరిజన ఉప ప్రణాళిక నిధులు రూ.63కోట్లతో 604 పనులు చేపట్టాం. టీఎస్ ఐపాస్ విధానంతో ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 101 పరిశ్రమలకు దరఖాస్తులు రాగా.. అన్నింటికీ అనుమతులు మంజూరు చేశారు. వీటి స్థాపనతో 1,435 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ కింద జిల్లాకు 6వేల ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది.

 కొత్తగూడెంలో విమానాశ్రయం
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలో భూసేకరణ పూర్తి చేసి.. కేంద్ర ప్రభుత్వానికి సదరు భూమిని అప్పగిస్తాం. అలాగే ఖమ్మంలో బైపాస్ రోడ్డు ఎన్నెస్పీ క్వార్టర్స్‌లోని 7.7 ఎకరాల స్థలంలో రూ.15కోట్లతో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించనున్నాం. ఇప్పటికే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో 19 కొత్త బస్సులను ప్రవేశపెట్టాం.

 సంక్షేమానికి చేయూతనిచ్చాం..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నిరుపేద కుటుంబాలకు సహాయం అందించాం. కల్యాణలక్ష్మితో 3,668 మంది ఎస్సీ వధువులకు రూ.18.70కోట్లు వివాహ ప్రోత్సాహ నగదుగా అందజేశాం. అలాగే 4,525 మంది గిరిజన వధువులకు రూ.23.7కోట్లు, షాదీ ముబారక్ కింద ముస్లిం మైనార్టీలకు రూ.5.71కోట్లు సహాయం అందజేశాం. జిల్లాలో బీసీ విద్యార్థుల కోసం 65 వసతి గృహాలు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది హరితహారంతో 3కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాం.

 వ్యవ‘సహాయం’..
ఈ ఖరీఫ్ సీజన్‌లో 38,312 క్వింటాళ్ల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందిస్తాం. పత్తి ఎగుమతి ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందిగా రైతులను కోరుతున్నాం. ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకు 3.58 లక్షల మంది రైతులకు రెండు విడతలుగా రూ.818కోట్లు రుణమాఫీ చేశాం. త్వరలోనే మూడో విడత రుణమాఫీ చేస్తాం. ఖరీఫ్‌లో రూ.259కోట్లు రుణాలు ఇవ్వనున్నాం.

 అమరుల కుటుంబాలకు అండ..
రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ఏడు అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. వీరిలో 6 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం అవసరం. అభివృద్ధి పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని.. అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది.

 కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఏజేసీ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement