ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా..?

15 Nov, 2016 23:02 IST|Sakshi
ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా..?

– హంద్రీ–నీవా లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం : 2012 నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లు వస్తున్నా ఇప్పటిదాకా కనీసం ఒక ఎకరాకు నీళ్లిచ్చారా..? అని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  హంద్రీ–నీవా లక్ష్యాన్ని అధికార పార్టీ నీరుగారుస్తోందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కేవలం ప్రచారం కోసం అప్పుడప్పుడు వంకలు, చెరువులకు నీళ్లిచ్చినట్లు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా రైతాంగం బాగు పడాలనే  తపనతో మంత్రులు, అధికార పార్టీ  ఎమ్మెల్యేలు పని చేయడం లేదన్నారు. హంద్రీ–నీవా నీటిని తామే తెప్పించామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

మొదటి దశలో జీడిపల్లికి  నీటిని తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు.  రెండోదశ పనులు రూ. 212  కోట్లతో 80 శాతం పూర్తయ్యాయన్నారు. రాప్తాడు  నియోజకవర్గంలో 1,7 ప్యాకేజీల్లో దాదాపు 1.72 కోట్ల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులు ఈ ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయని స్పష్టం చేశారు.   ఈ రెండున్నరేళ్లలో కేవలం 20 శాతం పనులు చేసి అందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశారన్నారు.

20 శాతం పనులకు వందశాతం నిధులా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు. జిల్లాకు వస్తున్న 17 టీఎంసీల నీటికి సంబంధించి టీఎంసీకి రూ. 12 కోట్లు కరెంటు ఖర్చు వస్తోందన్నారు.  ఈ నీటిని ఖచ్చితంగా 2 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చన్నారు. ఆరుతడి పంటలకైతే 3 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చని తెలిపారు. పీఏబీఆర్‌ కుడికాలువకు నీళ్లిచ్చే విషయంలో నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. నీళ్లిస్తున్నా...ప్రకాష్‌రెడ్డికి కనిపించలేదా? అని మంత్రి సునీత అంటున్నారని ఆమె లష్కరు  డ్యూటీ చేస్తోంది తప్ప ప్రత్యేకంగా తెప్పించిందేమీలేదని ఎద్దేవా చేశారు.

20న బస్సుయాత్ర
డెల్టా ప్రాంతంలో ఆయకట్టు సాగు, పంట కాలువలు, పొలాలకు నీళ్లు  ఎలా వెచ్చిస్తున్నారు తదితర అంశాలను పరిశీలించేందుకు ఈనెల 20న సాయంత్రం అనంతపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు ప్రకాష్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు కృష్ణా, నాగార్జునసాగర్, గోదావరి డెల్టా ప్రాంతాలను సందర్శించనున్నట్లు  వెల్లడించారు. ఇందుకోసం రెండు బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

జిల్లా నుంచి ఆసక్తిగల రైతు ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులు రావొచ్చని తెలిపారు. రావాలనుకునే వారు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో కాని, 70325 81653, 86866 1086 నంబర్లలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, నాయకులు వరప్రసాద్‌రెడ్డి, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు