చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలి

22 Mar, 2017 22:40 IST|Sakshi
చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలి
 నరసాపురం : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో డివిజన్‌లోని నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో వేసవిలో నీటి సరఫరా అంశంపై ఆయన సమీక్షించారు. చెరువులను నింపుకోవడానికి ఈ నెల 25వ తేదీ నుంచి కాలువలకు నీరు వదలుతారని చెప్పారు. నరసాపురం డివిజన్‌లో చించినాడ, వడ్డిలంక, రాపాక, జిన్నూరు కాలువల పరిధిలో మంచినీటి చెరువులను పూర్తిగా నింపుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఎం.అనంతరాజు మాట్లాడుతూ డివిజన్‌లో 69 తాగునీటి చెరువులు ఉన్నాయని అన్నారు. 25వ తేదీ నుంచి కాలువలకు నీరు పూర్తిస్థాయిలో విడుదల చేస్తున్న దృష్ట్యా అలసత్వం చూపించకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్‌ డీఈ సీహెచ్‌ వెంకటనారాయణ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తమ శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు