ఇదేమి జన్మభూమి?

6 Jan, 2017 00:09 IST|Sakshi
ఇదేమి జన్మభూమి?
‘జన్మభూమి’ సభను బహిష్కరించిన గిరిపుత్రులు
రేషన్‌ కార్డులు ఇవ్వకుంటే ఈ సభలెందుకు?
ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజేశ్వరి...సభ బహిష్కరణ
సాక్షి, రాజమహేంద్రవరం : గత జన్మభూమిలో రేషన్‌ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులకు ఇప్పటివరకు అతీగతీ లేదని, ఈ నేపధ్యంలో మళ్లీ జన్మభూమి నిర్వహించాల్సిన అవసరం ఏముందని గిరిపుత్రులు మండిపడ్డారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో బి.వెలమకోట, తామరపల్లి గ్రామ సభలను గిరిజనులు బహిష్కరించారు. రేషన్‌ కార్డులు ఇచ్చినప్పుడే గ్రామ సభ నిర్వహించాలని ఎమ్మెల్యే రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. ఎన్నిసార్లు దర ఖాస్తు చేసుకున్నా మరుగుదొడ్లు మంజూరుచేయనందుకు నిరసనగా ఏటపాక మండలం గన్నవరం గ్రామంలో మహిళలు చెంబులతో జన్మభూమి సభకు వచ్చి నిరసన తెలిపారు. రేషన్‌కార్డులు,పింఛన్లు మంజూరుకాక పేదలు మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారని ఉపసర్పంచ్‌ కందుకూరి మంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే సభను కొనసాగించాలని పట్టుబట్టారు. 
∙తూర్పు ఏజెన్సీ రాజవొమ్మంగిలో అమీనాబాద్, జడ్డంగి, లబ్బర్తి, లాగరాయి జన్మభూమి  గ్రామసభలను గిరిజనులు బహిష్కరించారు. మొదటి రెండు గ్రామాల ప్రజలు తమకు వెంటనే కుల«ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్న డిమాండ్‌ వ్యక్తం చేయగా, లబ్బర్తి, లాగరాయి ప్రజలు, గిరిజన రైతులు దాదాపు అర్ధశతాబ్దంగా తమ చిరకాల వాంఛ కిర్రాబు వద్ద పెద్దేరుపై ఆనకట్ట నిర్మించాలని ఆందోళనచేశారు. 
నేతల ఉపన్యాసాలతో గర్భిణులు, మహిళలకు ఇక్కట్లు 
కోరుకొండ మండలం గుమ్ములూరులో నిర్వహించిన జన్మభూమిలో సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేతల జోరు ఉపన్యాసాలకు వేదికగా మారాయి. 32మంది గర్భిణులు, బాలింతలు మండుటెండలో ఉండలేక అవస్థలు పడ్డారు. 
∙కోరుకొండకు చెందిన ఒక కన్నులేని గొల్ల మంగాయమ్మ సెప్టిక్‌ కావడంతో తన కుమార్తె  గొంతిదేవి కాలు తీసేసినా కూడా వికలాంగ ఫించన్‌ ఇవ్వలేదని   కోరుకొండ జన్మభూమి సభలో వాపోయింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన ప్రజలను పోలీసులు అడ్డగించి వెనక్కి పంపించేశారు.
అధికారుల నిలదీతలు..
రంగంపేట మండలం సుభద్రమ్మపేట గ్రామసభలో చాలాకాలంగా రేషన్‌కార్డులు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రజలు నిలదీశారు. కోరుకొండ మండలంలోని బుచ్చెంపేట జన్మభూమిలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను స్థానికులు నిలదీశారు. రంగంపేట మండలం ముకుందవరం జన్మభూమి సభలో చాగల్నాడు పథకం కింద పిల్ల కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాకాలంలో సైతం నీటి ఎద్దడి ఎదుర్కోవలసి వస్తోందని మండల ప్రజా పరిషత్‌ ప్రతిపక్షనేత గుత్తుల సుబ్రహ్మణ్యం విమర్శించారు.  అన్నవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. 
టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిర్వహించే జన్మభూమి సభలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడమే తప్పా లబ్ధిదారులకు ఒక్కరికి ఇవ్వలేదని కె.పెదపూడిలో ఎంపీడీవోను, ఇతర అధికారులను ప్రజలు నిలదీశారు. గత ఏడాది జనవరి 6న జన్మభూమి సభ నిర్వహించి కొత్త రేషన్‌ కార్డులను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పి ఏడాది కాలంగా ఎందుకు ఇవ్వలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను సర్పంచ్‌ రాజారావు, ఎంపీటీసీ సభ్యుడు ఉందుర్తి ఆనందబాబుతో పాటు పలువురు లబ్ధిదారులు నిలదీశారు. 
 
>
మరిన్ని వార్తలు