ఠారెత్తిస్తోన్న టమోటా !

8 Oct, 2015 04:16 IST|Sakshi
ఠారెత్తిస్తోన్న టమోటా !

♦ వర్షాలతో దెబ్బతిన్న పంటలు
♦ టమోటా కేజీ రూ.30లకు ఎగబాకిన వైనం
♦ ధరాభారంతో వినియోగదారుల విలవిల
 
 సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో టమోటా ధర  ఠారెత్తిస్తోంది. నిన్న మొన్నటివరకు కేజీ రూ.11-15ల మధ్యలో లభించిన టమోటా ఇప్పుడు ఏకంగా రూ.30లకు ఎగబాకింది. మంగళవారం రైతుబజార్‌లో కేజీ రూ.11లకు లభించిన టమోటా బుధవారం నాడు రూ.23లకు చేరడం టమోటా కొరతకు అద్దం పడుతోంది. ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.28-30ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో నగరానికి  టమోటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. కూరల్లో ప్రధాన ముడిసరుకైన టమోటా ధర పెరగడంతో మిగతా కూరగాయల ధరలు కూడా అదే బాటపట్టాయి.

మంగళవారం రైతుబజార్‌లో కేజీ రూ.17 ఉన్న బెండ ప్రస్తుతం రూ.23, అలాగే రూ.19 ఉన్న దొండ రూ.23కి పెరిగాయి. ఒక్క దొండ, బెండలే కాదు...  అన్ని కూరగాయల్లో రూ.2-12 వరకు ధరల పెరుగుదల కన్పిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయను కొందామన్నా కేజీ రూ.20-40 ధర పలుకుతుండటంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పంటలు దెబ్బతిన్నాయి.

ప్రత్యేకించి టమోటా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పంటను చేలల్లోనే వదిలేశారు. ఫలితంగా నగరానికి సరఫరా నిలిచిపోయి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఏర్పడి ఆ ప్రభావం ధరలపై పడింది. ప్రస్తుతం మదనపల్లి నుంచి దిగుమతయ్యే టమోటా పైనే  నగరం ఆధారపడాల్సి వస్తోంది. వర్షాల కారణంగా ఏపీ నుంచి వచ్చే దిగుమతులు కూడా సగానికి సగం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.  హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే కూరగాయల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయంటున్నారు.
 
 మార్కెటింగ్ శాఖ మౌనం
  అకాల వర్షాలు పడినప్పుడు మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను  ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎక్కడాలేని విధంగా మనకు రైతుబజార్ వ్యవస్థ, ఇతర విభాగాలున్నప్పటికీ అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ అవుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి ఈ శాఖ ఏమాత్రం సాంత్వన చేకూర్చలేక పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తోంది. మరో వారం రోజుల్లో లోకల్ టమోటా దిగుబడినిచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు వాటంతటవే దిగివస్తాయని అధికారులు వ్యాఖ్యానించడం విశేషం.

మరిన్ని వార్తలు