దిగివస్తున్న ఉల్లి... | Sakshi
Sakshi News home page

దిగివస్తున్న ఉల్లి...

Published Thu, Oct 8 2015 4:10 AM

దిగివస్తున్న ఉల్లి...

♦ సగానికి తగ్గిన ధరలు
♦ సబ్సిడీ విక్రయ కేంద్రాలకు త్వరలో స్వస్తి
♦ ఉల్లి దిగుబడులపై మార్కెటింగ్ శాఖ ఆశాభావం
 
 సాక్షి, హైదరాబాద్: రెండు నెలలుగా వంటింట్లో కన్నీరు పెట్టించిన ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరో వారం రోజుల్లో ఉల్లి ధర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధర కంటే తక్కువగా ఉండనుందని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో సబ్సిడీ విక్రయ కేంద్రాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ధరల స్థిరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో విక్రయ కేంద్రాల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 88 కేంద్రాల ద్వారా కిలోకు రూ.20 చొప్పున సబ్సిడీ ధరపై మార్కెటింగ్ శాఖ ఉల్లిని విక్రయిస్తోంది.

రాష్ట్రంలో ఉల్లి లావాదేవీల్లో ప్రధానమైన మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్లో ఆగస్టు 25న కిలో ఉల్లి ధర గరిష్టంగా రూ.68 పలి కింది. ప్రస్తుతం అత్యంత నాణ్యమైన నాసిక్ రకం ఉల్లి ధర కిలోకు గరిష్టంగా రూ.32 పలుకుతోంది. కర్నూలు రకం ధర కనిష్టంగా కిలోకు రూ.25కు పడిపోయింది. మహరాష్ట్రలోని లాసల్‌గావ్‌తో పాటు స్థానిక దిగుబడులు మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలుతో పాటు ఆలంపూర్, సదాశివపేట, దేవరకద్ర తదితర మార్కెట్లకు ఉల్లి దిగుబడులు పెరిగాయి. మరో వారం రోజుల్లో తాజా దిగుబడులు మార్కెట్లకు వెల్లువెత్తే అవకాశమున్నందున ధరలు మరింత పడిపోతాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది.

 ‘సబ్సిడీ’ విక్రయాలకు త్వరలో స్వస్తి
 ఉల్లి ధరలు పెరగడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం సబ్సిడీ విక్రయకేంద్రాలను ప్రారంభించింది. మలక్‌పేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు రూ.24.85 కోట్లు వెచ్చించి 5,309.02 మెట్రిక్ టన్నుల ఉల్లిని మార్కెటింగ్ విభాగం సేకరించింది. ఇందులో 5,157.44 మెట్రిక్ టన్నుల ఉల్లి విక్రయం ద్వారా 10.61 కోట్లను తిరిగి రాబ ట్టింది. కేంద్రం నుంచి మొదటిసారిగా ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.9.81 కోట్లు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని భరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుతుంటుండటంతో త్వరలో సబ్సిడీ ఉల్లి విక్రయాల్ని నిలిపివేయాలని భావిస్తోంది.

Advertisement
Advertisement