ఎమ్మెల్యే చెబితేనే మంజూరు!

11 Jul, 2016 09:16 IST|Sakshi

అనంతపురం: వ్యవసాయశాఖ అమలు చేస్తున్న మినీట్రాక్టర్ల పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ పథకాన్ని రాజకీయ నాయకులే అమలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ప్రతి పథకంలోనూ రాజకీయ నాయకులు జోక్యం ఎక్కువ కావడంతో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  ఈ క్రమంలో ఇపుడు మినీట్రాక్టర్ల మంజూరులో అధికార పార్టీ నేతలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఓకే చేయకుంటే ఏ పార్టీకి చెందిన రైతుకైనా ట్రాక్టర్‌ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు.

తొలివిడతలో 60 మందికి
స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద ఈ ఏడాది జిల్లాకు 500 మినీట్రాక్టర్లు మంజూరయ్యాయి. 50 శాతం రాయితీ లేదా గరిష్టంగా రూ.1.93 సబ్సిడీ వర్తింపజేశారు. కుబోటా, మిత్సుబిషి శక్తి, మహింద్రా, కెప్టెన్, ఇంటర్నేషనల్‌ కంపెనీలకు చెందిన ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో చివరి మూడు కంపెనీలకు చెందిన మినీట్రాక్టర్లపై రైతులు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. కుబోటా, మిత్సుబిషి కంపెనీలకు చెందిన ట్రాక్టర్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ రెండు కంపెనీలకు చెందిన డీలర్లకు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల అండదండలు ఉన్నట్లు కూడా సమాచారం. ఈ క్రమంలో తొలివిడత జాబితాలో 60 మంది వరకు దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం కలెక్టర్‌కు ఫైలు సిద్ధం చేశారు. ఇందులో మిత్సుబిషి కంపెనీ ట్రాక్టర్‌ కోసం ఎక్కువ దరఖాస్తులు రావడంతో మరో కంపెనీకి మింగుడుపడటం లేదని సమాచారం.

ఆ ట్రాక్టరే బాగుంటుంది...
ఎక్కువ మంది రైతులు ఒకే కంపెనీ ట్రాక్టర్లకోసం దరఖాస్తులు చేసుకోవడంతో..ఇతర కంపెనీల డీలర్లు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ట్రాక్టర్లు మంజూరు చేయకూడదని షరతు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా వ్యవసాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులను ఆ ట్రాక్టర్‌ అయితే ఇస్తామనేలా చెప్పిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్‌ అదే బాగుంటుందని, దాన్ని కోరుకుంటే ఇవ్వడానికి సిద్ధమని లేదంటే ఇంకో ట్రాక్టర్‌ అయితే రావడం కష్టమని రైతులను మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ట్రాక్టర్‌పైనే మక్కువ ఎందుకంటే..
చాలా మంది మండల స్థాయి అధికారులు ఒక కంపెనీ ట్రాక్టర్‌నే సిఫారసు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఎక్కువ మంది రైతులు మరో ట్రాక్టర్‌పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ధరలు, విడిభాగాల విషయానికి వస్తే రెండింటి మధ్య తేడా ఎక్కువగానే ఉంది. మిగతా కంపెనీల ట్రాక్టర్లతో పోల్చిచూసినా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. విడిభాగాల విషయానికి వస్తే రూ.20 విలువ చేసే వస్తువు రూ.100 పెట్టి కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని విడిభాగాలు దొరకడం కూడా కష్టమంటున్నారు. మిత్సుబిషి కంపెనీ ట్రాక్టర్‌తో పాటు రోటోవీటరు ఇస్తుండగా, కుబోటా కేవలం ట్రాక్టర్‌ మాత్రమే పంపిణీ చేసే పరిస్థితి ఉందంటున్నారు.

మిగతా జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ
జిల్లాలో అధికార పార్టీ రాజకీయ నేతలు, వారి అనుచర డీలర్ల మధ్య మినీట్రాక్టర్లు నలుగుతుండగా వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటికే రైతులకు ఇవ్వగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మాత్రం తొలివిడతగా ఫైలు సిద్ధం చేసిపెట్టారు. ట్రాక్టర్‌ మాది బాగుందంటూ ఒకరు... కాదు కాదు... మాది అంతకన్నా బాగుందంటూ ఇంకొకరు తెరవెనుక రాజకీయం నడుపుతుండటంతో 500 ట్రాక్టర్లు రైతులకు చేరాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకే చెప్పనిదే ఇచ్చేది లేదంటే వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు రైతులకు 10 శాతం కూడా మంజూరు చేసే పరిస్థితి అసలు కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు