తుంగఛిద్రం!

22 Mar, 2017 00:22 IST|Sakshi
తుంగఛిద్రం!
బింగిరాళ్లకు రెక్కలు
- హద్దులు దాటుతున్న విలువైన ఖనిజం
- బాల కార్మికులతో సేకరణ
- నదీ తీరంలో టీడీపీ నేత పాగా
- ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారం
- చోద్యం చూస్తున్న మైనింగ్‌, రెవెన్యూ అధికారులు
 
తుంగభద్ర ఎడారిగా మారుతోంది. నదీ తీరంలో కోట్లాది రూపాయల విలువైన బింగిరాళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అధికార పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ఐదేళ్లుగా అడిగే నాథుడే లేకపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీ నేత అండతో పాటు అధికారుల చేతులు తడుస్తుండటంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. 
 
కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): జిల్లా మీదుగా ప్రవహిస్తున్న తుంగభద్ర తీరంలోని బింగిరాళ్లకు(పెబ్బెల్‌ క్వార్ట్‌ ​‍్జ) రెక్కలొచ్చాయి. ఎలాంటి ఉపయోగం లేని విధంగా కనిపించే ఈ రాళ్ల ధర టన్ను రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. నదీ తీరంలో వందల ఎకరాల్లో విస్తరించిన ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వరద ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఈ రాళ్లు వేగంగా వచ్చే నీటిని నిలువరించే వీలుంటుంది. తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఈ రాళ్లు దోహదం చేస్తాయి.
 
ఇంతటి విలువైన రాళ్లను అక్రమార్కులు సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది మంది కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.120 చెల్లిస్తూ ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. కూలీలు సేకరించిన రాళ్లను 10-20 ఎంఎం, 20-30, 30-40 ఎంఎం.. ఇలా వంద వరకు సైజుల్లో నదీ తీరంలోనే విభజించి ఓ ప్రముఖ ప్రయివేట్‌ పాఠశాల వద్దకు రాత్రిళ్లు ఆటోల్లో తరలించి డంప్‌ చేస్తున్నారు. అక్కడ రాళ్లను సంచుల్లో నింపి బెంగళూరు, హైదరాబాద్‌, నల్లగొండ, విజయవాడ, అమరావతితో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
 
కోట్లు కురిపిస్తున్న ఖనిజం
ఒక్క పంచలింగాల ప్రాంతంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి  ఈ రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూలీలు ప్రతి రోజూ 40 టన్నుల రాళ్లు సేకరించి లారీల ద్వారా హద్దులు దాటిస్తున్నారు. ఇటీవల నల్గొండతో పాటు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఖనిజానికి డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో లారీలో 40 టన్నుల వరకు తరలించే అవకాశం ఉండటంతో.. టన్ను రూ.3వేలు చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క లోడుతో రూ.1.20 లక్షలు ఆక్రమార్కుల జేబుకు చేరుతోంది. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని పరిశీలిస్తే కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సాగిస్తున్న ఈ వ్యవహారంలో బాల కార్మికులను కూలీలుగా మార్చడం గమనార్హం.
 
బహిరంగమే.. నోరు మెదపరు
నగరానికి కూతవేటు దూరంలోని నదీ తీరంలో రాళ్ల తరలింపు నిత్యకృత్యమే అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి లేకుండా నది వద్దే రాళ్లను గ్రేడింగ్‌ చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గనుల శాఖలోని ఓ అధికారితో పాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సదరు వ్యాపారి లారీకి రూ.2వేల చొప్పున మామూళ్ల రూపంలో ముట్టజెబుతుండటం వల్లే వ్యవహారం సాఫీగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది.
 
బింగిరాళ్ల ఉపయోగం
- మంచినీటిని శుద్ధి చేసే ట్యాంకుల్లో..
- వాటర్‌ ప్యూరిఫయర్‌లలో..
- రహదారులు, హోటళ్లు, విలాసవంతమైన ఇళ్లకు అలంకరణ.
 
మా దృష్టికి రాలేదు
తుంగభద్ర నుంచి పెబ్బెల్‌క్వార్ట్‌ ‍్జను అక్రమంగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
- వెంకటరెడ్డి, భూగర్భ గనుల శాఖ
 
>
మరిన్ని వార్తలు