ఈ చేతికి అలసట లేదు! | Sakshi
Sakshi News home page

ఈ చేతికి అలసట లేదు!

Published Wed, Mar 22 2017 12:20 AM

ఈ చేతికి అలసట లేదు!

నిర్విరామంగా బౌలింగ్‌ చేస్తున్న జడేజా
ఈ సీజన్‌లో 4,106 బంతులు వేసిన బౌలర్‌
భారత విజయాల్లో కీలక పాత్ర   


ఒకవైపు అశ్విన్‌ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటాడు. వరుసగా‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, సిరీస్‌ అవార్డులు కొల్లగొడుతుంటాడు. కానీ రెండో ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసే మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఖాతాలో మాత్రం పెద్దగా వికెట్లు కనిపించవు. పరుగులివ్వకుండా పూర్తిగా కట్టి పడేసి, బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడమే అతని పనిలా కనిపించింది. కానీ ఇకపై జడేజా సహాయక పాత్రలోనే ఉండిపోయే బౌలర్‌గానే మిగిలిపోడు.

అశ్విన్‌ను దాటి అతను వికెట్లు పడగొట్టడంలోనూ తనదైన ముద్ర చూపిస్తున్నాడు. బ్యాటింగ్‌తోపాటు అవసరమైతే అప్పుడప్పుడు కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేయగల క్రికెటర్‌గా మాత్రమే మొదట్లో జడేజాకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు మ్యాచ్‌లో దాదాపు వంద ఓవర్లు వేయడమే కాదు... వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా కూడా అతను ఎదిగాడు. ఒకప్పుడు షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా తనకు అనుకూలించే పిచ్‌పైనే రాణించగలడని జడేజా గురించి చెప్పే మాట. కానీ ఇప్పుడు పిచ్‌తో పని లేకుండా ఎలాంటి ప్రభావం చూపించగలడో అతను తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నిరూపించాడు.  


సాక్షి క్రీడా విభాగం : బెంగళూరు టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 6 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించాడు. కానీ ఆ వికెట్లకు ముందు జడేజా వేసిన బంతులు ఆసీస్‌ను ప్రమాదంలో పడేశాయి. ఆ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ జడేజా బౌలింగ్‌ను ఎదుర్కోలేక అల్లాడిపోయారు. నేరుగా స్టంప్‌పైకి దూసుకొచ్చిన ప్రతీ బంతి వారికి ప్రమాదకరంగా కనిపించింది. అదే ఒత్తిడి చివరకు వికెట్లు అర్పించుకునేలా చేసింది. జడేజా వేసిన 8 ఓవర్లలో 5 మెయిడిన్లు ఉండగా ఇచ్చినవి 3 పరుగులే! అంటే ఓవర్‌కు సగం పరుగుకంటే కూడా తక్కువ. మిగతా ముగ్గురు బౌలర్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదిన కంగారూలు జడేజా బౌలింగ్‌లో ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు. ఒకదాని తర్వాత మరొకటి... పిచ్‌పై ఒకే ప్రాంతం వద్ద ప్రతీ బంతిని అంతే కచ్చితత్వంతో వరుసగా వేయగలగడం చిన్న విషయం కాదు. కానీ జడేజాకు అది ఇప్పుడు మంచినీళ్ల ప్రాయంలా మారిపోయింది. సగటున 90 సెకన్లలోపే చకచకా ఓవర్‌ పూర్తి చేసే జడేజా ప్రత్యర్థికి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒత్తిడి పెంచడంలో ఘనాపాటి.

 హిర్వాణీ చలవతో...
రాంచీ టెస్టులో జడేజా ఏకంగా 93.3 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాడు. దాదాపు 27 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌పై ఓవల్‌లో భారత లెగ్‌ స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణీ వేసిన 94 ఓవర్లకంటే మూడు బంతులే తక్కువ. ఆసక్తికర విషయం ఏమిటంటే స్వదేశంలో ఈ సుదీర్ఘ సీజన్‌ (13 టెస్టులు)కు ముందు తన బౌలింగ్‌లో కొన్ని మార్పుల కోసం జడేజానే స్వయంగా హిర్వాణీ వద్దకు వెళ్లాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లకు మ్యాచ్‌లో తప్ప నెట్స్‌లో బౌలింగ్‌ చేసే విషయంలో చాలా సార్లు సడలింపులు ఉంటాయి. కానీ హిర్వాణీ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. అతను చేసిన మొదటి పని జడేజాతో సుదీర్ఘ సమయం పాటు నిరంతరాయంగా బౌలింగ్‌ చేయించడం. నేరుగా నెట్స్‌లో బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేయకుండా సింగిల్‌ స్టంప్‌తో, బ్యాట్స్‌మన్‌ లేకుండా లెక్కలేనన్ని సంఖ్యలో జడేజా బంతులు వేశాడు. అదే అతడిని కచ్చితత్వంతో బౌలింగ్‌ చేసే విషయంలో రాటు దేల్చింది. వంద ఓవర్లు వేసినా లైన్‌ తప్పకపోవడం అసాధారణంగా చెప్పవచ్చు. బంతిని వేగంగా సంధించే విషయంలో, గ్రిప్‌ అంశంలో కూడా హిర్వాణీ సూచనలు జడేజాకు బాగా పనికొచ్చాయి.

బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు...
అశ్విన్‌ తరహాలో జడేజా బౌలింగ్‌లోని సాంకేతిక నైపుణ్యాల గురించి మాట్లాడడు. మేధావి తరహాలో విశ్లేషించడం కూడా అతనికి తెలీదు. జడేజాకు తెలిసిందల్లా ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించడం. బ్యాట్స్‌మెన్‌పై పదే పదే ఒత్తిడి పెంచి ఉచ్చులో బిగించడమే అతను చేసే పని. ఈ సీజన్‌లో నాలుగు జట్లతో జరిగిన టెస్టులలో కూడా అతను ప్రతీసారి కీలక బ్యాట్స్‌మెన్‌ వికెట్లు తీసి భారత్‌ను ముందంజలో నిలిపాడు. జడేజా బాధితుడిగా మారిన తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ను అవుట్‌ చేసిన బంతి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో కేవలం 54 పరుగులే ఇవ్వడం చూసిన కోహ్లి, ఇంత పొదుపైన బౌలింగ్‌ నేనెప్పుడూ చూడలేదంటూ సహచరుడిని అభినందించాడు. పనిలో పనిగా చెత్త పిచ్‌లపైనే వికెట్లు తీయగలడనే అపప్రథను కూడా జడేజా తొలగించుకున్నాడు.

బౌలింగ్‌ మెషీన్‌...
భారత గడ్డపై జట్టు విజయాల్లో స్పిన్నర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్‌లో జడేజా ప్రదర్శన కెప్టెన్‌గా తనకు ఎంతగా కలిసొచ్చిందో కోహ్లికి బాగా తెలుసు. అందుకే ఒకవైపు ‘బౌలింగ్‌ యంత్రం’గా జడేజాను ప్రశంసిస్తూనే మరోవైపు జట్టు గెలుపు కోసం ఇలాంటి బౌలర్‌ను శ్రమ పెట్టక తప్పదంటున్నాడు. ఈ సీజన్‌లో రాంచీ టెస్టు వరకు జడేజా ఏకంగా 684.2 ఓవర్లు (4,106 బంతులు) బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో చేసిన ఐదు అర్ధ సెంచరీలు అదనం. వీటికి తోడు అతని మెరుపు ఫీల్డింగ్‌ వల్ల జట్టుకు కలిగే ప్రయోజనం బోనస్‌. ఇంత భారం మోస్తూ కూడా గాయాలపాలు కాకుండా ఆడుతున్న తీరు చూస్తే జడేజా ఫిట్‌నెస్‌ స్థాయి అర్థమవుతుంది. ఇక మిగిలిన మరో టెస్టులోనూ తన వాడిని చూపిస్తే జడేజా కెరీర్‌లో ఈ ఏడాది చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.

జడేజా సింగిల్‌గా...
దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని (899 పాయింట్లు) నిలబెట్టుకున్నాడు. అయితే ఈసారి సంయుక్తంగా కాదు. సహచరుడు అశ్విన్‌ను వెనక్కి నెట్టి జడేజా తొలిసారి ఒక్కడే వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లు పడగొట్టగా... రెండు వికెట్లే తీసిన అశ్విన్‌ (862) రెండో స్థానానికి పడిపోయాడు. మరో పాయింట్‌ సాధిస్తే 900 పాయింట్ల మార్క్‌ను దాటిన అరుదైన బౌలర్ల జాబితాలో జడేజాకు చోటు దక్కుతుంది.  మరోవైపు ఇదే టెస్టులో ‘డబుల్‌ సెంచరీ’తో చెలరేగిన చతేశ్వర్‌ పుజారా బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి (861 పాయింట్లు) చేరుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్‌ కావడం విశేషం. ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నంబర్‌వన్‌ స్థానంలో (941 పాయింట్లు) ఉన్నాడు.  

2016–17 సీజన్‌లో జడేజా ప్రదర్శన
టెస్టులు - 12
ఇన్నింగ్స్‌-  24
ఓవర్లు - 684.2
మెయిడిన్లు - 175
పరుగులు  -1,540
వికెట్లు - 67
సగటు - 22.98
ఎకానమీ  - 2.25
ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు -  4
మ్యాచ్‌లో 10 వికెట్లు  - 1

Advertisement

తప్పక చదవండి

Advertisement