దివ్యాంగులకు ప్రయోజనకరం

25 May, 2017 22:59 IST|Sakshi
దివ్యాంగులకు ప్రయోజనకరం

పుట్టపర్తి టౌన్‌ : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీ బస్సుపాసు సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీలో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ పుట్టపర్తి డిపో మేనేజర్‌ రమణయ్య గురువారం వివరించారు. ప్రత్యేకంగా దివ్యాంగ మేళాలను ఏర్పాటు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పాస్‌లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎములకల సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, ఫెరాలసిస్‌కు సంబంధించి 40 శాతం,  మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్ధి మ్యాంద్యం 50 శాతం కలిగిన వారికి ఆర్టీసీ 50 శాతం రాయితీతో బస్సు పాసులను అందజేస్తోంది.

ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్‌ స్టేట్‌ బస్సులు, ఆల్ట్రా లగ్జరీ, సూపర్‌ లగ్జరీ బస్సులకు మాత్రం ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్న వారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీని కల్పిస్తారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను ఆర్టీసీ అధికారులకు అందజేసి రాయితీ బస్సు పాసులు పొందవచ్చు. గతంలో డిపోల్లో మాత్రమే ఈ బస్సుపాసు కేంద్రాలను నిర్వహించిన సంస్థ, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీ బస్సు పాస్‌లను అందజేస్తోంది.

దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక దివ్యాంగ మేళా ఏర్పాటు చేసి అర్హులందరికీ బస్సుపాసులు మంజూరు చేస్తాం. విద్యావంతులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ పరిసరాల్లోని దివ్యాంగులకు ఈ పథకంపై అవగాహన పెంపొందించాలి.
– రమణయ్య, ఆర్టీసీ డీఎం, పుట్టపర్తి

మరిన్ని వార్తలు