సౌకర్యాల మాటేమిటో...

10 Jan, 2017 00:02 IST|Sakshi
సౌకర్యాల మాటేమిటో...

పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరుగుతున్నా వేధిస్తున్న అసౌకర్యాలు
కొన్ని కేంద్రాల్లో లక్ష్యం దిశగా సాగుతున్న ఉద్యోగులు
మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభమే కాని    ప్రసవాలు
వసతులు కల్పిస్తే బాగుంటుందంటున్న ఉద్యోగులు


హన్మకొండ : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 95 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. ప్రజలకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనిని అరికట్టేందుకు పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. కొన్ని పీహెచ్‌సీల్లో ఎన్నో ఏళ్ల తర్వాత ప్రసవాలు ప్రారంభమైనా.. మరికొన్నింట్లో అసౌకర్యాలు, పరికరాల కొరత వేధిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులు, సిబ్బంది చొరవ చూపకపోవడం కూడా ప్రసవాలు జరగకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

17 పీహెచ్‌సీలు..
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 17 పీహెచ్‌సీలు ఉండగా.. ఆరు పీహెచ్‌సీలు 24గంటలు సేవలందిస్తున్నాయి. వీటన్నింటిల్లో ప్రస్తుతం కనీసం నెలకు 50 ప్రసవాలు చేయాలని కలెక్టర్‌ లక్ష్యంగా నిర్దేశించారు. అయితే 17పీహెచ్‌సీలు, 146 సబ్‌ సెంటర్లకు సంబంధించి మండలాల పరిధిలోని సిబ్బంది మాత్రమే ప్రజల్లో అవగాహన కల్పిస్తుండడంతో ఆయా మండలాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది.

పదహారేళ్లకు..
దుగ్గొండి మండలం కేశవాపురం పీహెచ్‌సీ ప్రారంభించాక పదహారేళ్లకు ఇటీవల ప్రసవం జరిగింది. ఇక తాజాగా శనివారం సంగెం పీహెచ్‌సీలో ఒకేరోజు మూడు ప్రసవాలు చేశారు. మరోవైపు కొన్ని పీహెచ్‌సీల్లో ఇప్పటివరకు ఒక్క ప్రసవం కూడా చేయలేదు. ఇందుకు కారణం సౌకర్యాల కొరత కారణం కాగా కొన్ని పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 46 ప్రసవాలు.. ఈ నెలలో ఇప్పటివరకు ఏడు ప్రసవాలు జరిగాయి.

సౌకర్యాల కొరత..
దుగ్గొండిలోని పీహెచ్‌సీలో 24గంటలు సేవలందిస్తుండగా భవనం మాత్రం శిథిలావస్థకు చేరింది. ఇక నెక్కొండలో మరో వైద్యుడి పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఖానాపురం పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు ఖాళీగా ఉంది. నల్లబెల్లి మండలం మేడపల్లి పీహెచ్‌సీ నుంచి రిఫరల్‌ కేసులు ఇతర పట్టణాలకు పంపాలంటే అంబులెన్స్‌ వచ్చేందుకు రవాణా సౌకర్యం సరిగా లేక సమస్యలు ఎదురవుతున్నాయి. బాంజీపేట పీహెచ్‌సీలో ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు. స్వీపర్, అటెండర్, వాచ్‌మెన్‌ లేరు. పర్వతగిరి పీహెచ్‌సీలో ఉన్న గైనకాలజిస్ట్‌ను డిప్యూటేషన్‌పై రాయపర్తి పంపించారు. దీంతో ఇక్కడ ప్రసవాలు చేయడం సమస్యగా మారింది. అలాగే, ల్యాబ్‌ మూతపడడంతో పరీక్షలు చేయడం ఎలాగో అర్థం సిబ్బంది అయోమయం చెందుతున్నారు. అయితే, పర్వతగిరి పీహెచ్‌సీలో ప్రసవం

పర్వతగిరి : పర్వతగిరి పీహెచ్‌సీలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రసవం జరిగింది. మండల కేంద్రానికి చెందిన పసుల స్వప్నకు ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా.. పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. దీంతో ఉదయం 5.45 గంటలకు ఆమె ప్రసవించగా ఆడ శిశువు జన్మించింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రశాంతి, సిబ్బంది హేమలత, రజిత పాల్గొనగా.. స్వప్న భర్త సుమన్‌కు రూ.700 చెక్కు అందజేశారు.
 

మరిన్ని వార్తలు