ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యం

26 Jan, 2017 22:26 IST|Sakshi
ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యం

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌టౌన్  : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని వైఎస్సాఆర్‌ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరు జాబితాలో తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలంటే ప్రతీఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం అవసరమన్నారు. ఓటు అనే ఆయుధంతో సాధారణ ప్రజలు సైతం ప్రజాప్రతినిధులు కావచ్చని తెలిపారు. ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా సరైన విధంగా ఉపయోగించుకుని  మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకొన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

రైల్యే లైన్  నిర్మాణానికి పంచజెండా..
రూ. 1200కోట్ల వ్యయంతో ఆర్మూర్‌– నిర్మల్‌ – ఆదిలాబాద్‌ వరకు 137 కి.మీ. మేర రైల్వే లైను నిర్మాణం పనుల కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాదే సర్వే చేయించి భూసేకరణ పూర్తిచేయిస్తామన్నారు. నిధులు విడుదల కాగానే వెంటనే పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా ‘ఓటు హక్కు’పై నిర్వహించిన వ్యాసరచన, వకృ్తత్వ, ఉపన్యాస, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి ఐకేరెడ్డి బహుమతులను అందజేశారు.

అవగాహన ర్యాలీ..
అనంతరం జిల్లా ఇన్ చార్జి కలెక్టర్‌ శివలింగయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఎన్నికల వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మనదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్థ ఉన్న దేశమని తెలిపారు. ఓటు హక్కుపై విద్యార్థులకు, యువతకు వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 85 డిజిటల్‌ క్లాస్‌ రూంలలో ఓటు హక్కు  ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

కలెక్టరేట్‌ ముందు మానవహారంగా ఏర్పడి అధికారులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ చైన్ గేట్‌ మీదుగా వైఎస్సాఆర్‌ ఫంక్షన్ హాల్‌ వరకు సాగింది. ఇందులో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్  దేవేందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి ప్రణీత, జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, డీపీఓ నారాయణ,  ఐసీడీఎస్‌ అధికారి విజయలక్ష్మీ, డీఏఎస్‌డబ్లు్య బాలసురేందర్, డీబీడబ్లు్యఓ నర్సారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు