ఫ్లోరైడ్‌ పీడ వదిలించండి

23 Mar, 2017 17:13 IST|Sakshi
ఫ్లోరైడ్‌ పీడ వదిలించండి

►  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
► ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయాలి
► జిల్లాలో శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు అవసరం
► ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి   


ఒంగోలు అర్బన్‌ : జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు తాను ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ని కలిసి విన్నవించినట్టు ఎంపీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కలిసి జిల్లాలోని ఫోరైడ్, కిడ్నీ బాధితుల సమస్యలను వివరించి, వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రధాని సూచన మేరకు తాను బుధవారం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్య స్వామినాథన్‌ను కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని ఫోరైడ్‌ బాధితుల ఫొటోలను చూపడంతో పాటు, ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాల్లో ఎక్కడ ఎంతమేర ఫోరైడ్‌ తీవ్రత ఉందనే విషయాన్ని  ఆమెకి వివరించినట్లు వైవీ తెలిపారు. గడిచిన రెండేళ్లలో కిడ్నీ సమస్యలతో జిల్లాలో 424 మంది చనిపోయిన విషయాన్ని తెలియపరిచానన్నారు. సమస్యకు మూల కారణాలను తెలుసుకునేందుకు ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయించాలని కోరినట్టు వివరించారు. సమస్య తీవ్రతని బట్టి జిల్లాలో శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే కొంత ఊరట ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కంటే జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందని వివరించానని పేర్కొన్నారు. వివరాలు తెలుసుకున్న సౌమ్య స్వామినాథన్‌ ఈ నెల 28 నుంచి కేంద్ర బృందం జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో తప్పక పర్యటిస్తుందని, సమస్యకు కారణాలను తెలుసుకొని శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు తెలియచేస్తామని చెప్పినట్లు ఎంపీ వైవీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు