ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం:జి.చెన్నయ్య

30 Aug, 2016 22:07 IST|Sakshi
మాట్లాడుతున్న చెన్నయ్య, సుధాకర్‌ తదితరులు

సుల్తాన్‌బజార్‌: ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య తెలిపారు. హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్‌ తేల్చి చెప్పినా... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎమ్మార్పీఎస్‌ నాయకులను వాడుకొని  దళితులను చీల్చడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉషా మెహ్రా కమిషన్‌ సూచించినట్లుగా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్‌లను కలుపుకొని ఒక కమిటీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో ఢిల్లీలో ‘మాలల మహా ధర్మయుద్ధం’ సభను ఏర్పాటు చేసి వర్గీకరణకు మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు.

ఈ సభలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మహిళలు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ మాల మహానాడు అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గైని గంగాధర్, శ్రీను, రమేష్, వి. సుధాకర్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు