నివేదిస్తాం.. నిర్ణయం ప్రభుత్వానిదే

12 Oct, 2015 21:50 IST|Sakshi
నివేదిస్తాం.. నిర్ణయం ప్రభుత్వానిదే

- నిమిషనిమిషానికీ క్షీణిస్తోన్న జననేత ఆరోగ్యం
- వైఎస్ జగన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించాలి
- ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్న వైద్యులు

గుంటూరు: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజు పూర్తి కావచ్చింది. సోమవారం మూడోసారి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జననేత ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీక్షపై టీడీపీ మంత్రులు చెవాకులు పేలిన నేపథ్యంలో మీడియా సమక్షంలోనే వైఎస్ జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించడం గమనార్హం. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..


వైఎస్ జగన్ శరీరంలో కీటోన్లు 3 ప్లస్ దాటాయి. బీపీ 130/80గా నమోదయింది. పల్స్ రేట్ 77గా ఉంది. ప్రస్తుత బరువు 72.4 కిలోలు. ఇప్పటి వరకు మూడు కేజీల బరువు తగ్గారు.  పరీక్షల అనంతరం జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ హనుమా నాయక్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు.

తక్షణమే ఆయనను ఆసుపత్రిలో చేర్చాలని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి పంపుతామని, అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జననేత ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తుండటంతో పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు