సీనియర్‌ హీరోలే నాకు స్ఫూర్తి!

14 Dec, 2016 22:26 IST|Sakshi
సీనియర్‌ హీరోలే నాకు స్ఫూర్తి!

కొత్తపేట : సీనియర్‌ హీరోల స్ఫూర్తి, నాన్న కోరికతో సినిమా రంగంలో ప్రవేశించినట్టు వర్ధమాన హీరో యలమంచిలి రేవంత్‌ అన్నారు. నాడు సీనియర్‌ ఎన్‌టీఆర్‌ 'లవకుశ' ఆధారంగా బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం'ను నిర్మించిన యలమంచిలి సాయిబాబా తన కుమారుడు రేవంత్‌ హీరోగా ‘ఇంటింటా అన్నమయ్య’  చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. శ్రీశైలంలో షిర్డీసాయిబాబా ఆలయం ప్రాంగణంలో నెలకొల్పేందుకు రేవంత్‌ తాత, ఎస్‌ఈడబ్ల్యూ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత యలమంచిలి నాగేశ్వరరావు పంచలోహ విగ్రహం రూపకల్పనను కొత్తపేటలోని ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌కు అప్పగించారు. బుధవారం ఆ విగ్రహం నమూనా పరిశీలనకు వచ్చిన రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ సాయిబాబా మూవీస్‌ బ్యానర్‌పై తండ్రి నిర్మించిన ‘ఇంటింటా అన్నమయ్య’లో అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే గాయకుడి పాత్రను పోషించానన్నారు.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో హీరోయిన్‌గా అనన్య (జర్నీ ఫేం), ఇతర ముఖ్య పాత్రలను బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు పోషించారని, సంగీతం కీరవాణి సమకూర్చారని చెప్పారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తన ద్వితీయ చిత్రం 'రాజా మీరు కేక' నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ చిత్రంలో సోబిత హీరోయిన్‌ కాగా తారకరత్న విలన్‌ రోల్‌ పోషిస్తున్నారని తెలిపారు. తాను ఒక్కో తరహా పాత్రల్లో ఒక్కో హీరోను అభిమానిస్తానని, అలా సీనియర్‌ ఎన్‌టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,బాలకృష్ణ తదితరుల స్ఫూర్తితో సినీ రంగానికి వచ్చానన్నారు. ఫిబ్రవరి 24న తాత జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. విగ్రహం చాలా బాగా వచ్చిందని శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు