లొసుగుల మయం

5 Jan, 2018 00:17 IST|Sakshi

ఇటు వైద్య విద్యనూ, అటు వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసి నిఖార్సయిన వ్యవస్థల రూపకల్పన కోసం ప్రామాణికమైన విధివిధానాలను రూపొందించామంటూ తీసు కొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లు చివరకు సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైన సోమవారం రోజున దేశ వ్యాప్తంగా వైద్యులు 12 గంటల సమ్మెకు దిగారు. అటు సభలో సైతం అన్ని పక్షాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంప డానికి కేంద్రం అంగీకరించింది. దేశంలో ప్రపంచశ్రేణి వైద్య విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తూ నీతిఆయోగ్‌ ఈ బిల్లు రూపకల్పనకు పూను కొంది. అయితే వైద్య రంగ నిపుణులు ఈ బిల్లు ముసాయిదా ఏడాదిక్రితం బయటి కొచ్చినప్పుడే పెదవి విరిచారు. వైద్య విద్య నియంత్రణ కోసం నెలకొల్పిన భార తీయ వైద్య మండలి(ఎంసీఐ)వల్ల ఆ రంగానికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. వైద్య కళాశాలల గుర్తింపు మొదలుకొని అదనపు సీట్లు, అదనపు కోర్సుల మంజూరు వరకూ అన్ని విషయాల్లోనూ ముడుపులు చేతులు మారతాయన్న అప ఖ్యాతిని ఆ సంస్థ మూటగట్టుకుంది.

2010లో ఆ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న కేతన్‌ దేశాయ్‌ లంచం తీసుకుంటూ దొరికిన తర్వాత ఆయన చేసిన అక్రమాల చిట్టా బయటపడింది. అర్హత లేని సంస్థలకు అనుమతులు మంజూరయ్యాయని, ప్రమా ణాలు ఎంత తీసికట్టుగా ఉన్నా చూసీచూడనట్లు వదిలేశారని, ...వీటన్నిటికీ మూలం ముడుపుల్లో ఉన్నదని తేలింది. ఆ తర్వాత వచ్చినవారి వల్ల సైతం ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. కనీసం తన జోక్యంతోనైనా పరిస్థితి చక్క బడవచ్చునని భావించి సర్వోన్నత న్యాయస్థానం రిటైరైన న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రూపొందించిన విధానాలు సైతం బేఖాతరయ్యాయి. ప్రక్షాళన చేయడానికి అసాధ్యమయ్యేంతగా ఎంసీఐ నాశ నమైందని అందరికీ అనిపిస్తున్న తరుణంలో మెరుగైన ప్రత్యామ్నాయాన్ని రూపొం దించాలని కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్‌ను కోరింది.

అయితే ఎన్‌ఎంసీ బిల్లు ఉన్న పరిస్థితిని బాగు చేయడం మాట అటుంచి, దాన్ని మరింత భ్రష్టు పట్టించే ప్రమాదం ఉందని అందులోని అంశాలు గమనిస్తే అర్ధమ వుతుంది. ఎంసీఐకి ఆ దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం దాని పని విధానంలో పారదర్శకత లోపించడం. దాని స్థానంలో వచ్చే ఎన్‌ఎంసీ మెరుగ్గా ఉండాలంటే సహజంగానే పారదర్శకతకు ప్రాధాన్యతనీయాలి. కానీ బిల్లులో అందుకు సంబం ధించిన సూచనలేమీ లేవు. పైగా ఎన్‌ఎంసీలో ఉండే 25మంది సభ్యులను ప్రభు త్వమే నియమిస్తుంది. వైద్య రంగంలాంటి కీలకమైన రంగాన్ని సరిచేయడానికి ఎలాంటి చర్యల అవసరం ఉన్నదో ప్రభుత్వం సూచించడంలో తప్పులేదు. కానీ అంతిమంగా దాన్ని మెరుగుపరిచే బాధ్యతను ఆ రంగంలోని నిపుణులకే వదలాలి. అప్పుడే దానికి ప్రజల్లో విశ్వనీయత ఏర్పడుతుంది. పనితీరులో లోటుపాట్లున్నా, దేన్నయినా చూసీచూడనట్టు వదిలేస్తున్న దాఖలాలు కనిపించినా సంస్థను జనం నిలదీస్తారు. సభ్యుల నియామకంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రాజకీయ పలు కుబడి ఉన్నవారికే తప్ప అన్యులకు అందులో చోటుండదు. సర్కారు ప్రమేయం ఉన్నది గనుక పరిస్థితి ఇలాగే ఉంటుందన్న నిర్లిప్తత ఏర్పడుతుంది.

వైద్య రంగంలోని సంప్రదాయ, ఆధునిక వ్యవస్థల అనుసంధానం కోస మంటూ బిల్లులో పెట్టిన ప్రతిపాదనలు మరింత విడ్డూరంగా ఉన్నాయి. భిన్న వైద్య విధానాలను ఉపయోగిస్తే సత్వర ఫలితముంటుందని, రోగం నుంచి త్వరగా కోలుకోవడం వీలవుతుందని వాదించేవారున్నారు. కానీ అది ఎంతవరకూ ఆచరణ సాధ్యం? ఒక జబ్బును అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి వైద్య విధానాలు చూసే తీరు ఒకేలా ఉండదు. రోగికి స్వస్థత చేకూర్చడానికి అను సరించే ప్రక్రియలు కూడా ఈ వైద్య విధానాల్లో భిన్నంగా ఉంటాయి. ఒక బ్రిడ్జి కోర్సు ద్వారా ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యులకు ఆధునిక వైద్య విధా నంలో అవగాహన కల్పించి వారు కూడా మందుచీటీల్లో అల్లోపతి ఔషధాలు రాసేందుకు అనుమతించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ విషయంలో సంప్ర దాయ వైద్య రంగ నిపుణులకు విధించే పరిమితులేమిటో, ఎలాంటి రోగాలకు సంబంధించినంతవరకూ వారు మందుచీటీలు రాయవచ్చునో బిల్లు స్పష్టంగా చెప్పలేదు. అందుకు సంబంధించిన విధివిధానాలను ఎన్‌ఎంసీ రూపొందిస్తుంది. దాని సంగతలా ఉంచి కేవలం ఆర్నెల్లో, ఏడాదో శ్రమపడి ఒక బ్రిడ్జి కోర్సు ద్వారా అవగాహన తెచ్చుకుంటే ఆధునిక వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చునని లైసెన్స్‌ ఇస్తే అది దేనికి దారితీస్తుందో ప్రభుత్వం ఆలోచించినట్టు లేదు. నిర్దేశించిన పరిమితులకు ఎందరు కట్టుబడతారు? వాటిని ఉల్లంఘిస్తే, ఏదైనా ముప్పు ఏర్ప డితే బాధ్యులెవరు?

ఒకపక్క ఎంబీబీఎస్‌ పూర్తయి వైద్య రంగంలోకొస్తున్నవారిలో తగినన్ని ప్రమాణాలుండటం లేదని భావించి అందుకోసం పట్టా ఇచ్చే ముందు వారికి మరో పరీక్ష పెట్టాలని ఆలోచిస్తూ... వేరే వైద్య విధానాల్లో చదివినవారిని నామమాత్రపు బ్రిడ్జి కోర్సుతో అనుమతించడం సరైందేనా? మన పల్లె సీమల్లో ఈనాటికీ కనీస వైద్య సదుపాయాలు లేవన్నది వాస్తవం. దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప చెప్పుకోదగ్గ ఆసుపత్రులు అందుబాటులో ఉండవు. చిన్న చిన్న వ్యాధులను నయం చేయడానికి సైతం ఎవరూ లేక నాటు వైద్యులను, చిట్కా వైద్యులను ఆశ్రయించి జనం దెబ్బతింటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి వెయ్యిమందికీ ఒక డాక్టర్‌ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. కానీ మన దేశంలో 1,674మందికి ఒక డాక్టరున్నారు. మారుమూల ప్రాంతాల్లో చాలా చోట్ల వైద్యులే లేరు. ఈ స్థితిని చక్కదిద్దడం అవసరమని అందరూ అంగీకరిస్తారు. కానీ అందుకు ఎన్‌ఎంసీ బిల్లు సూచిస్తున్న విధానం పరిష్కారమో... ప్రమాదక రమో ఆలోచించాలి. వైద్య రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ఈ బిల్లును సంపూర్ణంగా మార్చాలి.

మరిన్ని వార్తలు