గాజా గాయాలు.. పార్లమెంట్‌ మెనూ నుంచి వాటి తొలగింపు!

7 Nov, 2023 21:10 IST|Sakshi

ఇజ్రాయెల్‌-హమాస్‌ గ్రూప్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఒకవైపు భారీ ప్రాణ నష్టం.. మరోవైపు భారీ మానవతా సంక్షోభం దిశగా ముందుకెళ్తోంది. గాజాలో  పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉండగా.. తుర్కియే(పూర్వపు టర్కీ) ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ మెనూ నుంచి కోకాకోలా, నెస్లే ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌కు ఆ కంపెనీలు మద్దతు ప్రకటించాయని, అందుకే వాటిని తమ పార్లమెంట్‌ క్యాంటీన్‌ నుంచి తొలగిస్తున్నట్లు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. 

పార్లమెంట్‌ ప్రాంగణంలోని రెస్టారెంట్‌లలో, కఫేటేరియాల్లో, టీ హౌజ్‌లలో ఇకపై ఆయా ఉత్పత్తులను అమ్మకూడదని పార్లమెంట్‌ స్పీకర్‌ నుమాన్‌ కుర్తుల్మస్‌ పేరిట ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ పరిణామంపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. గాజాకు సంఘీభావంగా.. తమ దేశ ప్రజల డిమాండ్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ ఆ ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు గాజా దాడుల నేపథ్యంగా.. సోషల్‌ మీడియాలోనూ ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను, పాశ్చాత్య దేశాల కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్‌ నానాటికీ పెరిగిపోతోంది.  యుద్ధ వాతావరణ నేపథ్యంలో టర్కీ-ఇజ్రాయెల్‌ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

మరిన్ని వార్తలు