ఇంత దారుణమా!

18 Jun, 2019 00:19 IST|Sakshi

ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీం ఎనిమిది దశాబ్దాల క్రితం ‘జంగల్, జల్, జమీన్‌ హమారా’ నినాదాలే ఇరుసుగా పోరాడారు. ఆ పోరాటక్రమంలో అమరుడయ్యారు.  ఇన్నేళ్లు గడిచాక కూడా తమ జీవిక కోసం, నిలువనీడ కోసం ఆదివాసీలు ఉద్యమించక తప్పడం లేదు. కన్నెర్రజేస్తున్న అధికార యంత్రాంగం ధాటికి కష్టాలుపడక తప్పడంలేదు. ఈ దుస్థితిలో తెలంగాణ హైకోర్టు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మానవతావాదులందరికీ ఊరటనిస్తాయి. కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్‌ డిపోలో నిర్బంధించారని పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ షమీమ్‌లతో కూడిన ధర్మాసనం ఆదివారమైనా అత్యవసర అంశంగా భావించి విచారణ జరిపి వారందరికీ ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశిం చింది.

అంతవరకూ వారి బాగోగులకు ప్రభుత్వమే పూచీ పడాలని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలు యదార్థమే అయి ఉండొచ్చు. పులుల సంరక్షణ కేంద్రంగా ఉంటున్న ఆ ప్రాంతానికి ఆదివాసీలు అయిదారేళ్లక్రితం వచ్చి ఉండొచ్చు. ఆయనన్నట్టు ప్రభుత్వం దృష్టిలో అది ఆక్రమణే కావొచ్చు. ఇవన్నీ నిజమే అనుకున్నా జిల్లా అధికార యంత్రాంగం వారిపట్ల వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమైనది. క్షమార్హం కానిది.  ఈ నెల 12న పూజ కోసం అందరూ బయటికెళ్లిన సమయంలో అధికారులు మందీమార్బలంతో వచ్చి బుల్‌డోజర్లతో తమ ఇళ్లు, పశువుల పాకల్ని కూల్చేశారని... అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని పోలీసులు, అటవీ సిబ్బంది కొట్టారని ఆదివాసీలు ధర్మాసనానికి చెప్పడాన్ని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న సంశయం కలుగుతుంది. కొమరం భీం జిల్లాకు కలెక్టర్‌ ఉన్నారు. ఆదివాసీల సంక్షే మాన్ని కాంక్షించి పనిచేసే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉంది. గిరిజనుల అభ్యున్నతి కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం కోసం ప్రజా ప్రతినిధులు న్నారు. ఇంతమంది ఉన్నా, ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నా చివరకు ఆదివాసీలను అక్కడినుంచి పంప డానికి పోలీసులు, అటవీ సిబ్బంది, బుల్‌డోజర్లు తప్ప మరో మార్గం లేదనుకోవడం అధికారుల తీరును పట్టిచూపుతుంది. తాము అనుకుంటున్నవిధంగా ఆదివాసీలకు నచ్చజెప్పి ఒప్పించడానికి వారు ప్రయత్నించి ఉంటే, అందుకు సమయం పట్టినా ఓపిగ్గా వేచి ఉంటే బాగుండేది.

పర్యావరణ సమతూకం సాధనకు, ఆ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అత్యవసరమని, పట్టణీకరణ నానాటికీ విస్తరిస్తున్న వేళ వన్యప్రాణులను సంరక్షించడానికి వాటికోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పర్చడమే మార్గమని వన్యప్రాణి సంరక్షణ కోసం పాటుబడేవారు చెబుతారు. అమెరికా, యూరప్‌లలో ఉండే ఈ భావన 70వ దశకంలో మన దేశానికి కూడా చేరింది. 1973లో ఇప్పటి జార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో తొలిసారి పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటయింది. మొదట్లో 9గా ఉన్న ఈ కేంద్రాలు ఇప్పుడు 50 అయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సంరక్షణ కేంద్రాల్లో పులుల సంఖ్య 2,226కు చేరుకుందని 2014నాటి గణన చెబు తోంది. తాజాగా నిరుడు పులుల గణన ప్రారంభమైంది. ఈ కేంద్రాల నిర్వహణకు దేశంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్‌టీసీఏ) పనిచేస్తోంది. వన్యప్రాణులను కాపాడి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం సదాశయమే. అవసరమైనదే. కానీ ఆ క్రమంలో సహజంగానే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తమకు వన్యమృగాలు, వాటికి తాము కొత్త కాదని, తరతరాలుగా వాటితో సహజీవనం చేస్తున్నామని ఆదివాసులు చెబుతున్నారు. వాటిని సంరక్షించే పేరిట అడవి నుంచి వెళ్లగొడితే తమ జీవనం ప్రమాదంలో పడుతుందని వాపోతున్నారు.

2011నాటి జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీల జనాభా దాదాపు 11 కోట్లు. ఇది దేశ జనాభాలో 8.6 శాతం. 461 తెగలుగా ఉన్న ఈ ఆదివాసీల్లో దాదాపు 95 శాతంమంది అటవీ ప్రాంతాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. సరిగ్గా ఈ కారణం వల్లనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుండే ప్రాంతాల్లో తరచు సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివాసీల మంచికోసమే వారిని తరలిస్తున్నామని, ఇది ప్రగతిశీలమైన చర్య అని, దీనివల్ల వారు ‘ఆధునికం’ కావడానికి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా తరలించే సందర్భాల్లో ఆదివాసీ కుటుంబాలకు కలిగే నష్టాన్ని బట్టి రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకూ పరిహారం చెల్లించాలని నిరుడు నవంబర్‌లో జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ సిఫార్సు చేసింది. కుటుంబానికి ఇంటి స్థలం, రెండున్నర ఎకరాల వ్యవ సాయ భూమి, కుటుంబంలో కనీసం ఒకరికి తగిన శిక్షణనిచ్చి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడి పులుల సంరక్షణ కేంద్రంతో ముడిపడి ఉండే ఉద్యోగాన్ని చూపాలని కూడా సూచించింది. ఆదివాసీలకు పునరావాసం ఏర్పరిచేచోట రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది. 

ఈ సిఫార్సులన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తే ఆదివాసీలకు మేలు కలుగుతుందా లేదా అన్న సంగతలా ఉంచి కనీసం వాటినైనా కొలాంగోంది గ్రామంలో అమలు చేద్దామని అధికార యంత్రాంగం చూడలేదు. పైగా ఆదివాసీలతో ఎంతో మొరటుగా ప్రవర్తించింది. ట్రాక్టర్లలో తీసుకెళ్లి కనీస సదుపాయాలు లేని టింబర్‌ డిపోలో అక్రమంగా నిర్బంధించింది. వన్యప్రాణులపట్ల దయ కలిగి ఉండటం, వాటి క్షేమం కోసం ఆత్రుతపడటం మంచిదే. కానీ తోటి మనుషుల పట్ల తమ ప్రవ ర్తన ఎలా ఉందో, ఎలా ఉండాలో... ఇలాంటి విపరీత పోకడ ఈ వ్యవస్థపై ఆదివాసీల్లో ఎలాంటి అభిప్రాయం కలగజేస్తుందో ఆ అధికారులు కాస్తయినా ఆలోచించారా? హైకోర్టు ధర్మాసనం జోక్యంతో ఆదివాసీలకు ఇప్పటికైతే ఉపశమనం దొరికింది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించి నిర్దిష్ట వ్యవధిలో వారికి పూర్తి న్యాయం చేకూర్చడానికి అధికారులు కృషి చేస్తారని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు