తగునా ఇది సూకీ!

19 Dec, 2019 00:07 IST|Sakshi

ఉన్నట్టుండి పాత్రలు తారుమారైతే, స్వరం మారిపోతే దిగ్భ్రాంతిపడటం... కలో నిజమో తెలియక కంగారుపడటం ఎలాంటివారికైనా తప్పదు. నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరుకావడం, ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన మానవ హననమని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసించిన క్రౌర్యాన్ని కప్పెట్టే యత్నం చేయడం కళ్లారా చూసినవారికి  అలాగే అనిపించింది. ఆంగ్‌సాన్‌ సూకీ సాధారణ మహిళ కాదు.  పదిహేనేళ్లపాటు మయన్మార్‌ సైనిక దుశ్శాసకుల ఉక్కు నిర్బంధంలో మగ్గినా ఆమె మొక్కవోని పోరాట దీక్ష ప్రదర్శించారు. అలాంటి నాయకురాలు గత వారం ఐసీజే ముందు దాదాపు 30 నిమిషాలపాటు సైనిక పాలకులను సమర్థిస్తూ మాట్లాడటం ఎవరూ ఊహించలేరు. 2017లో మయన్మార్‌లో సైన్యం రోహింగ్యా తెగవారిపై విరుచుకుపడి గ్రామాలకు గ్రామాలు తగలబెట్టి, వేలాదిమందిని ఊచకోత కోసిన ఉదంతంపై దర్యాప్తు జరిపించి కారకులైనవారిని కఠినంగా దండించాలని ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం గాంబియా ఐసీజేలో దాఖలు చేసిన ఫిర్యాదుపై జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు.

మయన్మార్‌ సైన్యంపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరమని ఆమె గట్టిగా వాదించారు. తరచు సైనికులపైనా, పౌరులపైనా సాయుధ దాడులకు పాల్పడుతున్న ఆరకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(అర్సా) సంస్థను అదుపు చేసేందుకు సైన్యం తీసుకున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2017 ఆగస్టు 25న వేలాదిమంది అర్సా సాయుధులు 30 పోలీసు పోస్టులపైనా, గ్రామాలపైనా, రఖైన్‌లోని సైనిక స్థావరంపైనా దాడులు జరిపినప్పుడు సైన్యం వాటిని తిప్పికొట్టిందేతప్ప పౌరులను ఊచకోత కోసిందనడం అబద్ధమని సూకీ సెలవిచ్చారు. బాలికలపైనా, మహిళలపైనా అత్యాచారాలు జరిపిన సైనికులు, ఇళ్లల్లో చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా విసిరేశారని న్యాయమూర్తుల ముందు మహిళలు వాంగ్మూలం ఇస్తుండగా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయిన సూకీ, ఆ మర్నాడు సైన్యాన్ని గట్టిగా వెనకేసుకొస్తూ ప్రసంగించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది.

దాదాపు అరవైయ్యేళ్లుగా సాగుతున్న సైనిక నియంతృత్వంనుంచి 2015లో మయన్మార్‌ విముక్తమైనట్టు కనిపించినా ఆ దేశంలో ఇప్పటికీ సైన్యానిదే ఆధిపత్యం. ఆంగ్‌సాన్‌ సూకీని విడుదల చేసి ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి సైనికాధిపతులు అనుమతించినా, దేశాధినేత కాకుండా నిబంధనలు పెట్టారు. కనుక ప్రధాని పదవితో సమానమైన స్టేట్‌ కౌన్సిలర్‌ హోదాలో మాత్రమే ఆమె కొనసాగుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాల విషయంలో వారి అభీష్టాన్ని కాదంటే ఆ పదవి కూడా ఉండదన్న ఆందోళనతో సైనిక పాలకులకు సూకీ వంతపాడుతున్నారు. మయన్మార్‌ సైన్యం తమ దురాగతాలకు సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం గ్రామాలకు గ్రామాలను కాల్చి బూడిద చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్టు తమ సైనికులు అత్యాచారాలకు పాల్పడలేదని, పౌరుల్ని కాల్చి చంపలేదని వాదించడానికి అసలు రోహింగ్యాలు చెబుతున్నచోట గ్రామాలే లేవని బుకాయించడం కోసమే దీన్నంతటినీ సాగించారు. అయితే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జరిగిందేమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

ఇదే ఊచకోత మయన్మార్‌లో కాక మరోచోట జరిగుంటే అగ్రరాజ్యాలు తెగ ఆవేశపడేవి. ఆ దేశానికి సైన్యాన్ని తరలించేవి. పాలకుల్ని బెదిరించేవి. కానీ మయన్మార్‌ విషయంలో అది చెల్లుబాటు కాదు. దురాక్రమణకు ప్రయత్నిస్తే పొరుగునున్న చైనా దాన్నంతటినీ చూస్తూ ఊరుకోదు. ఆ దేశ పాలకులకు వత్తాసుగా ముందుకొస్తుంది. అందుకు సిద్ధపడదామనుకున్నా అదేమంత లాభసాటి కాదు. భూగోళంపై ఏమూల సహజవనరులున్నా వాలిపోయే తమ దేశంలోని కార్పొరేట్లకు రోహింగ్యాల గడ్డ రఖైన్‌ ఏమాత్రం పనికొచ్చే భూమి కాదు. అక్కడున్న సహజ వనరులు అతి స్వల్పం. కొద్దిమంది పౌరులకు పనికల్పించేందుకు కూడా ఆ వనరులు పనికి రావు. ఇక లాభాల మాటే లేదు. ప్రపంచంలో ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే దేశాలు చాలావున్నాయి. అందులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియావంటి సంపన్న దేశాలున్నాయి. కండబలం ప్రదర్శించడానికి వెనకాడని టర్కీ ఉంది. ఇస్లామిక్‌ దేశాల సంస్థ(ఓఐసీ) వంటివున్నాయి. ఎవరికీ రోహింగ్యాల వెతలు పట్టలేదు.

కళ్లముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి లేదా కనీసం అది తప్పని చెప్పడానికి దండిగా డబ్బు, కండబలం ఉండక్కర్లేదు. కాస్తంత నైతికబలం ఉంటే చాలు. కనీసం ఆఫ్రికా ఖండంలో ఎక్కడుందో ఎవరికీ తెలియని గాంబియా చేసింది ఆ పనే. అది మయన్మార్‌కు 11,265 కిలోమీటర్ల దూరానుంది. అయినా స్పందించింది. కడవలకొద్దీ కన్నీళ్లు కార్చడం తప్ప, రోహింగ్యాల కోసం ఏమీ చేయని బడా దేశాలు సిగ్గుపడేలా ఈ దారుణాన్ని ఐసీజే దృష్టికి తీసుకురావాలని అది నిర్ణయించింది. ఇప్పుడు ఐసీజేలో సైనిక దురాగతాలను వెనకేసుకొచ్చిన సూకీ వారి బాటలోనే కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు. ఒకే ఒక్క సందర్భంలో... అది కూడా ‘అర్సా’ గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఆ పేరు ప్రస్తావించారు.

కనీస అవసరాలైన తిండి, బట్ట, ఆవాసం, వైద్యం వంటివి లేక తరతరాలుగా రోహింగ్యాలు ఇబ్బందులు పడుతున్నారు. సైన్యం ఆగడాలతో పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పోయి అత్యంత దైన్యస్థితిలో శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది ఐసీజే విచారణ మాత్రమే. ఇందులో దోషులెవరో తేల్చడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింగ్యాలను వెనక్కి తీసుకొచ్చి, అంతా సవ్యంగా ఉందని చెప్పడం కోసం 2017 నవంబర్‌లో మయన్మార్‌ ఆ దేశంతో అవగాహనకొచ్చింది. అయితే కనీస హక్కులకు గ్యారెంటీ ఇస్తే తప్ప  వెనక్కి వెళ్లేందుకు వారు సుముఖంగా లేరు. ఐక్యరాజ్యసమితి సంస్థల ద్వారా వారికి అండదండలందించి, వారు మనుషులుగా బతకడానికి  సాయపడటం ప్రపంచ దేశాల కర్తవ్యం. 

>
మరిన్ని వార్తలు