ఫిరాయింపుదార్లకు చెంపపెట్టు

16 Nov, 2019 00:50 IST|Sakshi

కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌ అనర్హత వేటు వేయడం సరైందేనని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. అయితే ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం 2023 వరకూ వీరిపై అనర్హత వేటు వర్తిస్తుందన్న స్పీకర్‌ నిర్ణయాన్ని మాత్రం తోసిపుచ్చింది. దాంతో వచ్చే నెల 5న జరిగే ఉప ఎన్నికల్లో ఆ 17మంది ఎమ్మెల్యేలూ పోటీ చేసేందుకు ఆటంకం తొలగిపోయింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు మొత్తంగా ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు వంటిది. నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి, యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధి ష్టించినా తగినంత మెజారిటీ కరువై తప్పుకున్నారు. అటుపై జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి అధికారం లోకొచ్చింది. అయితే త్రుటిలో చేజారిన అధికార పీఠం కోసం యడియూరప్ప తెరవెనక సాగించిన మంత్రాంగం ఫలించి 14 నెలల్లో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ సర్కారు పతనమైంది. ఆ రెండు పార్టీలనుంచీ నెగ్గిన 17మంది ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో చేరి విశ్వాస పరీక్ష సమయంలో విప్‌ను ధిక్కరించడంతో స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటించారు. 

ఇటీవల చట్టసభల ప్రమాణాలు పతనమవుతున్నాయి. స్వల్ప మెజారిటీతో గద్దెనెక్కడం లేదా అలా మెజారిటీ లభించక విపక్షంలో కూర్చోవడం వంటి సమస్యలున్న పార్టీలు అవతలి పక్షం ఎమ్మె ల్యేలను ప్రలోభపెట్టి తమ శిబిరంలో చేర్చుకునే ధోరణి అన్నిచోట్లా పెరిగింది. ఫిరాయింపుల చట్టం నిబంధనలను స్పీకర్‌లు తుంగలో తొక్కుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలకు సాగిలబడుతు న్నారు. కర్ణాటక సంక్షోభ సమయంలో స్పీకర్‌గా ఉన్న రమేశ్‌కుమార్‌ ఇందుకు కాస్త భిన్నంగా ప్రవర్తించారు. ఫిరాయింపుదారుల్ని అనర్హుల్ని చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన చర్యను సమర్థి స్తూనే ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసే 2023 వరకూ ఆ అనర్హత వర్తిస్తుందనడాన్ని తప్పుబట్టింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సభ కాలపరిమితి పూర్తయ్యే వరకూ మంత్రి పదవులు లేదా ఇతర లాభదాయక పదవులు చేపట్టకూడదని చెప్పింది తప్ప... సభ కాలపరిమితి పూర్తయ్యేవరకూ వారిపై అనర్హత వేటు వర్తిస్తుందని చెప్పలేదు. వాస్త వానికి పార్టీ ఫిరాయించి ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తున్న సభ్యులపై అనర్హత వేటు సభ పదవీ కాలం పూర్తయ్యేవరకూ ఉండటం సబబైనదే. కానీ నిబంధనలు అందుకు అనుగుణంగా లేనప్పుడు స్పీకర్‌ ఆ చర్య తీసుకోవడం సబబు కాదు. ఫిరాయింపుదారులు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారని చర్య తీసుకున్న స్పీకర్‌ తాను సైతం మరో తోవలో అలాంటి ఉల్లంఘనకే పాల్పడకూడదు. 

స్పీకర్ల నిర్ణయాలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మా సనం చెప్పిన అంశం అత్యంత కీలకమైనది. తమ నిర్ణయాలు న్యాయస్థానాలు ప్రశ్నించజాలవని ఈమధ్యకాలంలో చాలామంది స్పీకర్లు వాదిస్తున్నారు. న్యాయస్థానాల నుంచి వచ్చే నోటీసుల్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఫలానా సభ్యుడిపై/సభ్యురాలిపై తీసుకున్న చర్య చెల్లదని న్యాయస్థానాలు చెబుతున్నా బేఖాతరు చేస్తున్నారు. పర్యవసానంగా అనేక సమస్యలు తలెత్తుతు న్నాయి. శాసనవ్యవస్థతో ఘర్షణ ఎందుకన్న కారణంతో కావొచ్చు... న్యాయస్థానాలు సైతం ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ఆర్‌కె రోజా విషయంలో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన పరిధిని అతి క్రమించి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. సస్పెన్షన్‌పై అప్పటి విపక్ష నేత జగన్‌మోహన్‌మోహన్‌ రెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తుతూ 340(2) నిబంధన ప్రకారం సభ్యుల్ని ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకూ మాత్రమే స్పీకర్‌ సస్పెండ్‌ చేయవచ్చునని, ఏడాదిపాటు సస్పెండ్‌ చేసే అధికారం ఆయనకు లేదని చెప్పినా కోడెల పట్టించుకోలేదు. లేని అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నారని అనంతరకాలంలో సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. 

స్పీకర్‌ స్థానంలో ఉండేవారు ఉన్నత ప్రమాణాలను పాటిస్తుంటే, రాజ్యాంగ విలువలను పరిర క్షిస్తుంటే వేరు. వారి చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించవలసిన అవసరమే రాదు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం చట్టసభల అధ్యక్షులకు విస్తృతాధికారాలివ్వడం సబబేనని 1992లో వెలువరించిన కిహోటో హొల్లోహన్‌ కేసులో జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య నేతృత్వంలోని ధర్మాసనం మెజారిటీ తీర్పునిచ్చింది. అయితే స్పీకర్ల చర్య దురుద్దేశపూర్వకంగా, వక్రంగా, రాజ్యాంగ నిబంధనలకూ, సహజ న్యాయసూత్రాలకూ విరుద్ధంగా ఉన్నప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయొచ్చునని కూడా స్పష్టం చేసింది. అదే కేసులో మైనారిటీ తీర్పు వెలువరించిన జస్టిస్‌ లలిత్‌ మోహన్‌ శర్మ, జస్టిస్‌ జేఎస్‌ వర్మల అభిప్రాయం గమనించదగ్గది. సభలో మెజారిటీగా ఉండే పక్షం నుంచి నిరంతరం మద్దతు అవసరమైన స్థితిలో స్పీకర్లు స్వతంత్రంగా, న్యాయబద్ధంగా వ్యవహరించడం అసాధ్యమని ఆ తీర్పు పేర్కొంది. ఇది వాస్తవమని ఇన్నేళ్ల ఆచరణ రుజువు చేస్తోంది. కనుకనే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనలపై నిర్ణయాధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలన్న డిమాండ్‌ పుట్టుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరహాలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించే సమస్యేలేదని నిర్ద్వంద్వంగా ప్రకటించే రాజకీయ నాయ కత్వం ఉంటే ఇలాంటి డిమాండ్‌ అవసరమే ఉండదు. ఏదేమైనా కర్ణాటక ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు సరైందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగ్గది. 

>
మరిన్ని వార్తలు