ఆర్టీఐకి గండం గడిచినట్టేనా?

21 Jul, 2018 02:05 IST|Sakshi

పదమూడేళ్లక్రితం పుట్టి, అడుగడుగునా గండాలే ఎదుర్కొంటున్న సమాచార హక్కు చట్టం మరో సారి త్రుటిలో ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నట్టు కనబడుతోంది. ఆ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టదల్చుకున్న బిల్లు నిలిచిపోయింది. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లును సభ ముందుంచాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు మీడియాలో వెలువడిన కథనాలే నిజమైతే పౌర సమాజ కార్యకర్తలు, ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగార్చడానికే సవరణ బిల్లు తెస్తున్నారని విమర్శలు నలుమూలలా వెల్లువెత్తుతున్నా ఇన్నాళ్లూ ప్రభుత్వం మౌనముద్ర దాల్చింది. దీని వెనకున్న ఉద్దేశమేమిటో చెప్పాలని  రెండు నెలలుగా పౌర సమాజ కార్యకర్తలు డిమాండు చేస్తున్నా  జవాబు లేదు.

విమర్శలు, ఆరోప ణలు వెల్లువెత్తుతున్నా అందులోని అంశాలను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఎకా యెకీ సభలో బిల్లు తీసుకొచ్చి, అంతగా దానిపై రభస జరిగితే ఆ తర్వాత సెలెక్ట్‌ కమిటీకి పంపా లన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ ఎవరితో చర్చించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా రూపొందించిన ఈ బిల్లును అడ్డుకుంటామని విపక్షాలు గట్టిగా చెప్పడం వల్ల కావొచ్చు... చివరి నిమిషంలో సవరణ బిల్లు ప్రతిపాదనను వాయిదా వేశారు. జాతీయ స్థాయిలోని సమాచార ముఖ్య కమిషనర్‌(సీఐసీ), ఇతర సమాచార కమిషనర్లు... రాష్ట్రాల స్థాయిలోని సమాచార ముఖ్య కమిష నర్లు, ఇతర సమాచార కమిషనర్ల హోదాలు, జీతభత్యాలు, పదవీకాలం వగైరా నిబంధనలకు మార్పులు తీసుకొస్తూ వివిధ సెక్షన్లకు ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు.

ప్రస్తుత చట్టం ప్రకారం సీఐసీకి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హోదా, ఇతర కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల హోదా కల్పించారు. అలాగే రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్ల హోదాను, ఇతర కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాను ఇచ్చారు. జీతభత్యాలు కూడా వారి వారి హోదాలకు తగ్గట్టు నిర్ణయించారు. సమాచార హక్కు కమిషన్‌లో బాధ్యతలు నిర్వ ర్తిస్తున్నవారు ప్రభుత్వాల ఒత్తిళ్లకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఇవి దోహదపడ తాయని భావించారు. ఎన్నికల సంఘంలో పనిచేసేవారి విధులు... సమాచార హక్కు కమిషన్‌లో పనిచేసేవారి విధులు  వేర్వేరు గనుక హేతుబద్ధం చేసేందుకు ఈ సవరణల తలపెట్టామని ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఎవరినీ నమ్మించలేదు.

ఈ సవరణలు సమాచార హక్కు కమిషన్‌లోని కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్‌ మొదలుకొని రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల వరకూ అంద రినీ అనిశ్చితిలో పడేస్తాయి. సర్కారు దయాదాక్షిణ్యాలకు విడిచిపెడతాయి. వారి బాధ్యతల నిర్వ హణలో అడుగడుగునా అడ్డం పడతాయి. 2004లో ఆర్టీఐ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ లకూ, వాటికి ముందు పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాల స్ఫూర్తికీ ప్రస్తు తం తలపెట్టిన సవరణలు విరుద్ధమైనవి.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే డిప్యూటీ కమిషన ర్లుండాలని ఆ బిల్లు ప్రతిపాదించగా, అది కమిషన్‌ స్వతంత్రతను దెబ్బతీస్తుందని భావించి స్థాయీ సంఘం దాన్ని తొలగించింది. ఇప్పుడు ప్రభుత్వం వేరే రూపంలో ఆ పనే చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. 


అమెరికా, వివిధ యూరప్‌ దేశాలు పారదర్శకత విస్తృతిని నానాటికీ పెంచుకుంటున్నాయి. ఆసియా ఖండంలోని పలు దేశాలు కూడా ఆ దిశగానే కదులుతున్నాయి. ప్రజాస్వామ్య మూలాలు పటిష్టంగా ఉండాలంటే ఏ మినహాయింపూ లేకుండా పాలనా సంస్థలు పారదర్శకంగా పనిచేయా లని, చేసే ప్రతి చర్యకూ అవి జవాబుదారీ వహించాలని అన్ని సమాజాలూ భావిస్తున్నాయి. ప్రజల నుంచి ఒత్తిళ్లు నానాటికీ పెరగడంతో అన్నిచోట్లా ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. పాలనలో దాపరికం లేనప్పుడే నిజాయితీ పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని జనం బలంగా విశ్వసి స్తున్నారు. కానీ అదేం దురదృష్టమో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో పాలకులు అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు.

స్వచ్ఛమైన పాలన అందిస్తామని, నీతినిజాయితీ లతో పాలిస్తామని హామీ ఇచ్చినవారే అధికారంలోకొచ్చాక అది తమ జాగీరన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నిలదీసినవారి నోరు మూయించాలని చూస్తున్నారు. చిత్రమేమంటే 2005లో అమల్లోకొచ్చిన సమా చార హక్కు చట్టానికి మూలాలు 1976లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులోనే ఉన్నాయి. సమా చారం కోరడం పౌరుల ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు దశాబ్దాలనాడు సమాచార హక్కుపై చైతన్యం వచ్చిన దేశంలో ఆర్టీఐ చట్టానికి అడుగడుగునా ఇలా అడ్డంకులు ఎదురవుతుండటం దిగ్భ్రాంతికరం. ఈ చట్టానికి నారూ నీరూ పోసిన యూపీఏ ప్రభుత్వమే అది తనకు కంట్లో నలుసుగా మారుతున్నదని గ్రహించి ఏడాది తిరగకుండా దాన్ని నీరుగార్చాలని చూసింది. ఆ తర్వాత కూడా పలు ప్రయత్నాలు చేసింది. 

ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న తేడా లేకుండా దాదాపు అన్ని ప్రభుత్వాలూ సమాచార హక్కుకు నిరంతరం అడ్డం పడుతూనే ఉన్నాయి. కేంద్ర సమాచార కమిషన్‌లో నాలుగు స్థానాలు చాన్నాళ్లనుంచి ఖాళీగా పడి ఉన్నా భర్తీ చేయలేదు. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈమధ్యే ముగ్గురు సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు చేసింది. కేంద్ర సమాచార కమిషన్‌లోనూ, వివిధ రాష్ట్రాల్లోని సమాచార కమిషన్‌లలోనూ గుట్టగుట్టలుగా దరఖాస్తులు పడి ఉంటున్నాయి. ఫలితంగా పాలనలో పారదర్శకత తీసుకురావాలన్న ఆర్టీఐ చట్టం మౌలిక ఉద్దేశమే దెబ్బతింటోంది. ఈ పరి స్థితిని చూసి ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలను మందలించింది.  కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోదల్చుకున్నదో ఎక్కడా వెల్లడి కాలేదు. కానీ సభా ప్రవేశం చేయబోయి ఆగిన ఈ సవరణ బిల్లు ఆర్టీఐ చట్టాన్ని మరింత భ్రష్టు పట్టించేలా ఉంది. దీన్ని ఉప సంహరించుకోవడం తక్షణావసరం.
 

మరిన్ని వార్తలు