మరోసారి పుతిన్‌ ఏలుబడి

9 May, 2018 00:55 IST|Sakshi
వ్లాదిమిర్‌ పుతిన్‌

రష్యాలో దాదాపు ఇరవైయ్యేళ్లుగా ప్రధానిగా లేదా దేశాధ్యక్షుడిగా అధికారాన్నే అంటిపెట్టు కుని ఉంటున్న వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం నాలుగోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో అంచనాలను మించి 77 శాతం ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌ ఆరేళ్లపాటు... అంటే 2024 వరకూ అధికారంలో ఉంటారు. సామ, దాన, భేద, దండోపాయాలతో రాజకీరంగంలో బలమైన ప్రత్యర్థులు లేకుండా చేసు కున్నా, పోటీ నామమాత్రంగానే ఉన్నా చాలాచోట్ల అధికార పక్షం భారీయెత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయంటేనే ఈ ఎన్నికలు ఎంత ఏకపక్షంగా జరిగాయో అర్ధమవుతుంది.

అయితే పుతిన్‌కు ఇంటా బయటా ఉన్న సవాళ్లు తక్కువేమీ కాదు. అంతర్జా తీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవడం, 2014లో క్రిమియాను ఆక్రమించుకోవడం   లాంటి పరిణామాలు రష్యా ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. ఆ తర్వాత వెనువెంటనే పాశ్చాత్య దేశాలు, అమెరికా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకు పోయింది. ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం పుతిన్‌ ప్రభుత్వ వ్యయంలో గణనీయంగా కోత విధించారు. ఫలితంగా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

కానీ చమురు ధరలు నిరుడు క్రమేపీ పెరగడం మొదలయ్యాక వృద్ధి రేటు పుంజుకోవడం మొదలైంది. పర్యవసానంగా పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వృద్ధి అవుతాయన్న ఆశాభావం ఉంది. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నియంత్రణలోకొస్తాయని రష్యా ఆశిస్తోంది. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇంకా అలాగే ఉన్నాయి. పైగా బ్రిటన్‌లోని శాలిస్‌బరీలో నివాసముంటున్న రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్‌ను, ఆయన కుమార్తెను విష రసాయనం ప్రయోగించి మట్టుబెట్టాలని చేసిన ప్రయత్నం తర్వాత ఈ ఆంక్షల తీవ్రత ఎక్కువైంది.

తమ భూభాగంలో నేరుగా పుతిన్‌ ఆదేశాలతో ఈ రసాయన దాడి జరిగిందన్న ఆగ్రహంతో బ్రిటన్‌ యూరప్‌ యూనియన్‌ దేశాలనూ, అమెరికానూ కలుపుకొని మరిన్ని ఆంక్షలు అమలయ్యేలా చూసింది. ఆంక్షల పరిధిలో ఉన్న రష్యా కంపెనీల ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని, ఆ కంపెనీలతో లావాదేవీలు జరపడాన్ని  ఈ దేశాలన్నీ నిషేధించాయి. ఫలితంగా పాశ్చాత్య దేశాల ఆర్థిక సంస్థలు రష్యాకు దూరంగా ఉండిపోయాయి. వీటన్నిటితోపాటు ప్రభుత్వంలో పైనుంచి కిందివరకూ వేళ్లూనుకున్న అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోంది. పుతిన్‌ చుట్టూ చేరిన బృందమే దీనికంతకూ కారణమన్న ఆరోపణలున్నాయి.

రష్యా రుణభారం పెరుగుతుండటం, రూబుల్‌ రేటు అంతకంతకూ పడిపోవడం మదుపుదారులను భయపెడుతున్నాయి. చమురు రంగంలో కొత్తగా ఏర్పడుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఉత్సాహాన్ని ఈ పరి ణామాలు దెబ్బతీస్తున్నాయి. అయితే పుతిన్‌ నిబ్బరంగానే కనిపిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేసి, ఎగుమతులను మరింత పెంచడం, తయారీ రంగం, వ్యవసాయాధారిత పరిశ్రమల రంగం పుంజుకునేందుకు చర్యలు తీసుకోవడం తన ముందున్న లక్ష్యాలని ఆయన ప్రకటించారు. వీటిని సాధిస్తే రాగల కాలంలో రష్యా ప్రపంచంలోని తొలి అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని భరోసా నిచ్చారు.

అయితే పాశ్చాత్యదేశాల ఆంక్షలను అధిగమించేంతగా అంతర్జాతీయ రంగంలో పలుకుబడి పెంచుకుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. 2014లో ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని పుతిన్‌ సైన్యాలు చేజిక్కించుకున్నాయి. అదిప్పుడు రష్యా సమాఖ్యలో భాగంగా ఉంది. సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదార్లపై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ తిరుగుబాటు దార్లకు వత్తాసు పలుకుతున్న అమెరికా, పాశ్చాత్యదేశాలను రష్యా సవాలు చేస్తోంది. ఈ పరిణామాలన్నీ పుతిన్‌ దూకుడును తెలియజెబుతాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి పుతిన్‌ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి.

వాటిపై అమెరికాలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. నిరుడు అమెరికాలోని, యూరప్‌ దేశాల్లోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల, ఆసుపత్రుల వెబ్‌సైట్లపై జరిగిన సైబర్‌ దాడి వెనక రష్యా హస్తమున్నదన్న అనుమానాలు న్నాయి. ట్రంప్‌ అధికారంలోకొచ్చాక రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తారని ఆయన ప్రతినిధి ఒకరు రష్యా రాయబారికి హామీ ఇచ్చిన సంభాషణల రికార్డు వెల్లడై అల్లరైంది. దీంతో అయిష్టంగానైనా ట్రంప్‌ పుతిన్‌కు వ్యతిరేకం కాక తప్పలేదు. పాశ్చాత్య దేశాలతో కలిసి రష్యాపై ఆంక్షలు విధించవలసి వచ్చింది. దేశంలో తనపట్ల నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతను అరికట్టేందుకు పుతిన్‌ చేయని ప్రయత్నమంటూ లేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలనూ, సమావేశాలనూ నిరోధించడం, అరెస్టులు చేయించడం అక్కడ రివాజుగా మారింది. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తాడని అంచనా వేసిన విపక్ష నేత అలెక్సీ నవాల్నీపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. పుతిన్‌ ప్రమాణస్వీకారానికి ముందురోజున దేశవ్యాప్తంగా వందలాదిమందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పుతిన్‌ ప్రతిపక్షాలను మాత్రమే కాదు... తన సొంత పార్టీ యునైటెడ్‌ రష్యాను కూడా ఎదగనీయకుండా చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా అధి కారంలో ఉంటున్నా, ప్రభుత్వ వ్యవస్థల్ని ఎంతగా తనకనుకూలంగా మార్చుకున్నా యునైటెడ్‌ రష్యాను ఏ స్థాయిలోనూ బలోపేతం చేయలేదు. పార్టీ బలంగా తయారైతే ప్రత్యర్థులు పుట్టు కొస్తారని ఆయన భయం కావొచ్చు. నియంతలు శక్తిమంతులుగా కనబడతారు.  కానీ లోలో పల వారిని భయం వెన్నాడుతూనే ఉంటుంది. పుతిన్‌ కూడా దానికి అతీతం కాదు. మొత్తానికి సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న రష్యాను ఆయనెలా గట్టెక్కించగలరో, అందుకోసం అనుసరించే ఎత్తుగడలేమిటో మున్ముందు తెలుస్తుంది. 

 

 
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు