లంకను దారికి తెస్తారా?!

9 Mar, 2015 00:38 IST|Sakshi

ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాల విషయంలో ఆచి తూచి అడుగేయక పోతే కాలక్రమంలో ఎలాంటి సమస్యలు రాగల అవకాశం ఉన్నదో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ్‌సింఘే చేసిన తాజా ప్రకటన తేటతెల్లం చేసింది. ఉత్తర శ్రీలంక ప్రాంతంలో తమ సముద్ర జలాల పరిధిలోకి వచ్చి చేపలు పట్టడం ద్వారా లంక జాలర్ల జీవనోపాధిని భారత జాలర్లు దెబ్బతీస్తున్నారని రనిల్  ఆరోపించడమే కాదు... అలా చొరబడేవారిని కాల్చిచంపే హక్కు కూడా తమకుంటుందని హెచ్చ రించారు. మనం శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో సముద్ర జలాలు పంచు కుంటున్నాం. మిగిలిన రెండు దేశాలతోనూ ఇందుకు సంబంధించి సరిహద్దులు నిర్ణయమైనా లంకతో కుదిరిన ఒప్పందాల్లో స్పష్టత కొరవడింది. బంగాళాఖాతం లో కొంత ప్రాంతం, పాక్ జలసంధి, మన్నార్ జలసంధి, హిందూ మహా సముద్రం వైపు కొంత...దాదాపు 400 కిలోమీటర్ల మేర ఇరు దేశాల మధ్యా సరిహద్దు ఉంది. ఇది ఎంత ఇరుగ్గా ఉంటుందంటే రెండు దేశాల తీరాలకూ మధ్య దూరం కొన్నిచోట్ల దాదాపు 15 కిలోమీటర్లు మించదు. కనుక చాలాచోట్ల ఇరుదేశాల జాలర్లు తెలిసో, తెలియకో ఒకరి ప్రాంతంలోకి మరొకరు చొరబడక తప్పనిస్థితి.
 
 మన దేశం 1974లో కచ్చాతీవు ప్రాంతాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసి ఉండకపోతే ఇది పెద్ద సమస్య అయ్యేది కాదు. ఆ ప్రాంత  సముద్ర జలాల్లో మత్స్య సంపదపైనే ప్రధానంగా ఆధారపడి జీవించే జాలర్లకు ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులేమిటని ఆలోచించి ఉన్నా, కనీసం వారి అభిప్రాయమేమిటో తెలుసు కోవడానికి ప్రయత్నించినా కచ్చాతీవు ప్రాంతాన్ని ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంత సులభంగా ఇచ్చివుండేది కాదు. అది ఒక మైలు పొడవు, 300 గజాల వెడల్పు ఉన్న 285 ఎకరాల ప్రాంతం మాత్రమే కావొచ్చుగానీ ఆ దీవి మత్స్యకారులకు చాలా విలువైనది. ఆ నేలపై మొక్క కూడా మొలిచే అవకాశం లేకపోయినా అక్కడి జలాల్లో అపారమైన రొయ్యల సంపద ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆ దీవి మత్స్యకారులకు రక్షణనిస్తుంది. ఇదంతా శతాబ్దాలనుంచి సాగుతున్న వ్యవహారం. 1974 నాటి ఒప్పందం దీన్ని గుర్తించినట్టే కనబడింది. భారత మత్స్యకారులు, ఆ దీవిలో నిర్మించివున్న చర్చికి వచ్చే భారత యాత్రికులు యథాతథంగా అక్కడికి రావొచ్చని ఆ ఒప్పందం చెప్పినా తర్వాత కాలంలో శ్రీలంక దానికి వేరే భాష్యం ఇచ్చింది. ఆ ప్రాంతానికి సమీపంలో చేపలు పట్టే భారత జాలర్లకు కేవలం తమ వలలు ఆరబెట్టుకునే హక్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 1976లో కుదిరిన మన్నార్  జలసంధి ఒప్పందం దీన్ని మరింత కుదించింది. నిజానికి 1980కి ముందు ఈ ఒప్పందాలవల్ల జాలర్లకు పెద్దగా సమ స్యలు ఎదురు కాలేదు. ఆ తర్వాత శ్రీలంకలో లిబరేషన్ టైగర్ల పోరాటం ప్రారంభ మయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మత్స్యకారుల పేరిట టైగర్ల సంచారం ఎక్కువైందని, ఆయుధాల చేరవేత పెరిగిందని లంక నావికాదళం ఆరోపించడం ప్రారంభించింది. దాన్ని అరికట్టడానికంటూ విచక్షణారహితంగా జాలర్ల పడవలపై కాల్పులు జరిపేది. ఆ ఘటనల్లో అనేకులు ప్రాణాలు కోల్పోయేవారు. రెండు దేశాలమధ్యా పలుమార్లు చర్చలు జరిగాక 1998నుంచి ఈ తరహా ఘటనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే, జాలర్ల నిర్బంధాలు ఆగలేదు.
 
 మత్స్యకారులు నిత్యం మృత్యువును సవాల్ చేస్తూ జీవనయానం సాగించాల్సి ఉంటుంది. పడవపై వె ళ్లినవారు తిరిగొచ్చేవరకూ ఇంటిల్లిపాదికీ ఆందోళనే! తీర ప్రాంతాల్లో నెలకొల్పుతున్న పరిశ్రమలు విడిచిపెట్టే కాలుష్యం, పర్యావరణాన్ని బేఖాతరుచేసి సాగించే నిర్మాణాలు చేపలను దూరానికి తరిమేస్తున్నాయి. ఎంతో దూరం వెళ్తే తప్ప అవి దొరకడం లేదు. తీర ప్రాంతానికి సమీపంలో నాటు పడ వలపై మాత్రమే చేపల వేట సాగాలని నిబంధన ఉన్నా దాన్ని ఎవరూ పట్టించు కోవడంలేదు. మత్స్య పరిశ్రమలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించి పోటీ పెంచేశాయి. ఆ సంస్థలు మర పడవలను దించి విచక్షణారహితంగావేట సాగించడంతో అంతం తమాత్రంగా దొరికే చేపలు కూడా సామాన్య మత్స్యకారులకు లభ్యం కావడం లేదు.
 
 ఇన్ని సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మత్స్యకారులు చేపల కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సివస్తున్నది. ఈ క్రమంలోనే లంక జాలర్లతోనైనా, మరో దేశానికి చెందిన జాలర్లతోనైనా మన మత్స్యకారులకు ఘర్షణలు తప్పడంలేదు. అలాగే ఆయా దేశాల నావికా సిబ్బందికి బందీలుగా పట్టుబడక తప్పడం లేదు. ఆచరణలో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలకు పరిష్కారం కను గొనడం, తమ జాలర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే మరో దేశానికి చెందిన వారిపట్ల కూడా సానుభూతితో వ్యవహరించడం ఏ దేశానికైనా సంక్లిష్ట సమస్యే. కానీ నేర్పుతో, ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించడమనేది కనీస బాధ్యత. రనిల్ విక్రమ్‌సింఘే ఆ బాధ్యతను మరిచారు. జీవన్మరణ పోరాటమే తప్ప దురుద్దేశాలు ఏమీ లేని నిరాయుధులపై పరాక్రమం చూపుతామంటూ బెదిరిస్తు న్నారు. బహుశా కచ్చాతీవును లంక పరం చేసినప్పుడు మన దేశం కనీసం కొన్ని షరతులైనా విధించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదు. అవి లేకపోబట్టే రనిల్ అలా హెచ్చరించగలిగారు. మత్స్యకారులకు సరిహద్దు జలాల పరిధిపై అవగా హన కల్పించడం, మత్స్య సంపద అడుగంటిపోవడానికి కారణాలేమిటో అధ్యయ నం చేయించడం, ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించడం, మత్స్య సంపద అధికంగా ఉన్న ప్రాంతాలను పొరుగు దేశాల నుంచి లీజుకు తీసుకోవడం, మర పడవల వినియోగంపై ఆంక్షలు విధించడం, ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ఉమ్మడి గస్తీ నిర్వహించడం వంటి చర్యలు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడంలో దోహదపడతాయి. మరో నాలుగు రోజుల్లో శ్రీలంక వెళ్లబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ... రనిల్ బెదిరింపుల నేపథ్యంలో జాలర్ల సమస్యపై కూడా దృష్టి సారించగలరని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు