దౌర్జన్య రాజకీయం!

10 Jan, 2014 03:29 IST|Sakshi

సంపాదకీయం: ఏ సమస్యపై అయినా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజం. కానీ, వాటిని పీకనొక్కడం ద్వారా మాయం చేయాలనుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. న్యూఢిల్లీలో మరోసారి ఇలాంటి గుణాన్ని ప్రదర్శించారు కొందరు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉంచాలా, వద్దా అనే అంశంలో చెప్పిన మాటలకు సహనం కోల్పోయిన కొందరు బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలో ఉన్న ఆప్ కార్యాలయంపై దాడిచేసి, విధ్వంసం సృష్టించారు.  తాము హిందూ రక్షా దళ్‌కు చెందినవారమని చెప్పుకున్నారు. ఇదే బృందానికి చెందిన వ్యక్తులు రెండేళ్లక్రితం భగత్‌సింగ్ క్రాంతి సేన పేరిట వచ్చి ప్రశాంత్ భూషణ్‌పై ఆయన కార్యాలయంలోనే చేయిచేసుకున్నారు. గతంలో కర్ణాటకలో సైతం ఇలాంటి వ్యక్తులే సంస్కృతి, సంప్రదాయాల పేరిట పౌరులను భీతావహుల్ని చేయడానికి ప్రయత్నించారు.  ప్రశాంత్ భూషణ్ లబ్ధప్రతిష్టుడైన క్రియాశీల న్యాయవాది.
 
 చాలా విషయాల్లో ఆయనకు దృఢమైన అభిప్రాయాలున్నాయి. అంతేకాదు... ఆ అభిప్రాయాలకు అనుగుణమైన కార్యాచరణ కూడా ఉన్నది. ఆ కారణంవల్లనే న్యాయవ్యవస్థలో సంస్కరణలు జరగాలని, న్యాయమూర్తులు కూడా ప్రజలకు జవాబుదారీ కావాలని, అందుకోసం తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆయన ఉద్యమించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం  హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలి యంవంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టులో పోరాడి, దాన్ని ఆపించిన ఘనత ఆయనదే. యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్కాంతో సహా ఎన్నో కుంభకోణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా పోరాడి వాటిపై చర్యలు తీసుకొనేలా చేశారు. సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16మందిలో సగంమంది అవినీతిపరులని ఆయన వ్యాఖ్యానించినప్పుడు పెద్ద అలజడి రేగింది. దానిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార వ్యాజ్యం నడుస్తున్నది కూడా.
 
 ప్రశాంత్ భూషణ్ ఆచరణపైగానీ, అభిప్రాయాల విషయంలోగానీ అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. ఆయన వ్యక్తిగా వివిధ సమస్యలపై పోరాడినప్పుడు, అన్నా బృందంలో సభ్యుడిగా ఉంటూ అవినీతి వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన సహచరులు కొందరు ప్రశాంత్ అభిప్రాయాలతో విభేదించారు. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపైనా ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి ఏవిధంగా పొరపాటు అభిప్రాయాలో, ఆయన అవగాహనలో ఉన్న లోపాలేమిటో చెప్పడానికి ఎవరికైనా హక్కున్నది. కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉంచాలా, లేదా అనే అంశంపై అక్కడ రిఫరెండం నిర్వహించాలని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యానం అభ్యంతరకరమని దాడిచేసినవారు చెబుతున్నారు. అభ్యంతరాలుండటం తప్పేమీ కాదుగానీ అందుకోసమని దాడికి దిగడ ం హేయం. ప్రశాంతే చెప్పినట్టు ఆయన రిఫరెండం కోరింది కాశ్మీర్ భారత్‌లో ఉండాలా, లేదా అనే అంశంపై కాదు. అలాగే, ప్రశాంత్ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, తమకు సంబంధంలేదని ఆప్ చెప్పింది.
 
 ఇంతకూ దౌర్జన్యానికి దిగిన బృందం చెప్పదల్చుకున్నదేమిటి...అచ్చం తాము విశ్వసించే అభిప్రాయాలే అందరికీ ఉండాలనా?
 ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను కాపాడే జవాన్లను, వారి త్యాగశీలతను కొనియాడేవారు సైతం కాశ్మీర్‌లో జరిగిన కొన్ని ఘటనల విషయంలో ఆవేదన వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రం గనుక కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులతో సున్నితంగా వ్యవహరించాలని పలువురు చెప్పివున్నారు. ముఖ్యంగా సైన్యానికి విశేషాధికారాలు ఇస్తున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని విచక్షణాయుతంగా వినియోగించకపోవడంవల్ల సమస్యలు విషమిస్తున్నాయని వారి ఆందోళన. అక్కడ జరిగే ఏ చిన్న ఘటననైనా ఆసరా చేసుకుని ఉద్రిక్తతలు సృష్టించాలని పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నిస్తాయి గనుకే అత్యంత జాగురూకతతో మెలగాలన్నది వారి సూచనల ఆంతర్యం.
 
 యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఆ చట్టాన్ని రద్దుచేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్లపై సివిల్ కోర్టుల్లో విచారణను నిరోధిస్తున్న సెక్షన్ 6ను తొలగించాలని నిరుడు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ జీవన్‌రెడ్డి అయినా, జస్టిస్ వర్మ అయినా ఆ చట్టం దుర్వినియోగమైన తీరును లోతుగా గమనించాకే ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈమధ్యే సైన్యం సైతం కాశ్మీర్‌లో 2010లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ బూటకమైనదని నిర్ధారణకొచ్చి ఒక కల్నల్, మేజర్‌సహా ఆరుగురిపై కోర్టు మార్షల్ జరపాలని నిర్ణయించింది. ముగ్గురు యువకులను పాక్ చొరబాటుదార్లుగా చిత్రీకరించి ఎన్‌కౌంటర్ పేరిట హతమార్చిన ఘటన అది. అప్పట్లో ఆ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ కాశ్మీర్ వ్యాప్తంగా జరిగిన నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారి 123మంది పౌరులు భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయారు.
 
 ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలాచోట్ల సైన్యం అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పలుమార్లు చెప్పారు. అక్కడ సైన్యం ఉండే విషయంలో రిఫరెండం జరపాలనడం ప్రశాంత్ భూషణ్ అవగాహనా లోపం అయి ఉండొచ్చు... ఒక పార్టీలో భాగంగా మారారుగనుక వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడంలో ఉండే పరిమితులు ఆయనకు అర్ధం కాకపోయి ఉండొచ్చు. కానీ, అంతమాత్రాన కొందరు వ్యక్తులు తమ దౌర్జన్యానికి దాన్ని ఒక సాకుగా తీసుకోవడం తగనిపని. దాడికి దిగినవారు ఆప్ ఆరోపిస్తున్నట్టు బీజేపీ ప్రోత్సాహంతో వచ్చారా, లేదా అన్నది ఇంకా తేలవలసివున్నది. కానీ, ఎలాంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలూ పాటించకుండా, ఏ విలువలూ లేకుండా పేట్రేగే ఇలాంటి శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఉంది.

మరిన్ని వార్తలు