పదిలో పట్టుకు అడుగులిలా..

3 Jul, 2014 03:32 IST|Sakshi
పదిలో పట్టుకు అడుగులిలా..

 నూతన సిలబస్‌లో గణితశాస్త్రంలో 14 అధ్యాయాలు ఇచ్చా రు. సంఖ్య పరంగా అధ్యాయాలు ఎక్కువగా ఉన్నా.. తక్కువ కంటెంట్, ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలను చేర్చారు. 1 నుంచి 7 (పేపర్-1) వరకు వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి అధ్యాయాలు ఉన్నాయి.8 నుంచి 14 (పేపర్-2) వరకు సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శ రేఖలు-ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి-త్రికోణమితి అనువర్తనాలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం అధ్యాయాలను చేర్చారు.
 
 గత సిలబస్‌తో పోల్చితే ప్రస్తుత సిలబస్‌లో వాస్తవ సంఖ్యలలోని సంవర్గమానాలు, సమితులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, క్షేత్రమితి, సంభావ్యత అధ్యాయాలు కొత్తవి.ప్రతి అధ్యాయంలోని ప్రాథమిక భావనలను, సూత్రాలను వాటిపై ఆధారపడే సమస్యలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకంలో సమస్యలు కాకుండా అలాంటి స్వభావం ఉన్న ప్రశ్నలు ఇచ్చారు. ఏ అధ్యాయం నుంచైనా ఎన్ని ప్రశ్నలైనా రావచ్చు. కాబట్టి ప్రతి అధ్యాయం కీలకమే. ప్రతి భావన మీద సమస్యలను సొంతంగా తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయాలి.ప్రస్తుతం సిలబస్, ఎన్‌సీఈఆర్‌టీ 10వ తరగతి సిలబస్ ఒకే విధంగా ఉంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, గోల్డెన్ సిరీస్ బుక్స్, ధనపతి రాయ్ పబ్లికేషన్స్ పుస్తకాలను అనుబంధంగా చదవాలి.
 -కట్టా కవిత
 
 బయాలజీ
 నూతన సిలబస్‌లోని అధిక శాతం అంశాలు 9వ తరగతికి కొనసాగింపుగా 10వ తరగతిలో ఇచ్చార ని చెప్పొచ్చు. గత సిలబస్‌తో చూసిన, 9వ తరగతి సిలబస్ పోల్చిన అనువంశికత మాత్రమే చెప్పుకోదగ్గ నూ తన అంశం. చదవడం కంటే అధ్యాయానికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. గత సిలబస్‌లో ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని అధికంగా ఇచ్చి వాటి నుంచి అధిక భాగం జ్ఞాన రంగానికి చెందిన ప్రశ్నలు అడిగే వారు. కానీ నూతన సిలబస్‌లో పాఠ్యాంశాల నిడివి తగ్గింది. ముఖ్యమైన అంశాలను వివరిస్తూ వాటి మీద జ్ఞానం, అవగాహన, అభినందన, నిత్య జీవిత అన్వయానికి సంబంధిత ప్రశ్నలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పుస్తకాన్ని చదవడం-గుర్తుంచుకోవడం అనే పద్ధతిలో కాకుండా చేయడం-చర్చ-నేర్చుకోవడం వంటి విధానాల్లో తమను తాము మెరుగుపరుచుకోవాలి.
 
 మరో కీలక అంశం.. ప్రశ్నలను యథాతథంగా అడగకుండా వివిధ రకాలుగా మార్చి ఇవ్వొచ్చు. కాబట్టి విద్యార్థులు చదువుతున్నాను అనే భావనలో కాకుండా నేర్చుకుంటున్నాను అనే ధోరణితో ఉండాలి.అన్ని పాఠ్యాంశాలను విధిగా చదవాల్సిందే. గతంలో మాదిరిగా ఈ పాఠం నుంచి ఇన్ని మార్కులు వస్తాయి అనే నియమం ప్రస్తుత సిలబస్‌లో లేదు. బృంద చర్చలు, చేస్తూ నేర్చుకోవడం వంటి విధానాల ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.నూతన పరీక్షా విధానంలో ఒక ప్రశ్నకు విద్యార్థి ప్రతిస్పందన ఆధారంగా సమాధానం రాసే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే ఏమవుతుంది? దీనికి సమాధానంగా..ఒక విద్యార్ధి భూమిపై గల జీవులకు ఆక్సిజన్ లభించదు అని రాస్తే, మరో విద్యార్ధి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు అని చెప్పొచ్చు.
 -జి. శ్రీనివాస్
 
 ఫిజికల్ సైన్స్
 గతంలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలు వేర్వేరు విభాగాలుగా ఉండేవి. నూతన పాఠ్య పుస్తకంలో భౌతిక-రసాయ శాస్త్రాలను కలిపి 14 యూనిట్లు ఇచ్చారు. ఉష్ణం అనే నూతన పాఠ్యాంశాన్ని చేర్చారు. వీటిలో 7 యూనిట్లు భౌతిక శాస్త్రం (ఉష్ణం, కాంతి పరావర్తనం, సమతల ఉపరితలం వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను రంగుల ప్రపంచం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతం). మిగిలిన 7 యూనిట్లు రసాయన శాస్త్రానికి చెందినవి. అవి.. రసాయన చర్యలు-సమీకరణాలు, ఆమ్లాలు-క్షారాలు-లవణాలు,పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీరకరణ-ఆవర్తన పట్టిక, లోహసంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు. ఈ మొత్తం యూనిట్లలో లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు, రసాయన బంధం, విద్యుదయస్కాంతం, మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక పాఠాలు పూర్తిగా కొత్తవి. మిగిలిన పాఠాలలో ఉష్ణం 7వ తరగతిలో, కాంతికి సంబంధించిన మౌలిక భావనలు 6,7 తరగతుల్లో, పరమాణు నిర్మాణం గురించి 9వ తరగతిలో,
 
  విద్యుత్ ప్రవాహం భావనలను 6,7,8 తరగతుల్లో పరిచయం చేశారు. వీటిలో కీలకమైనవి.. పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు. మానవుని కన్ను-రంగుల ప్రపంచం అనే పాఠాన్ని జీవశాస్త్రంతో అన్వయిస్తూ చదవాలి. ఉష్ణం, కాంతి అధ్యాయాలపై పట్టుకు గణితంలోని ప్రాథమిక భావనలు తెలిసి ఉండాలి. నూతన సిలబస్‌లో భావనల పరిధి విస్తృతం. కాబట్టి తరగతికి వెళ్లే ముందు ఆ రోజు బోధించే పాఠాన్ని చదవడం మంచిది. పాఠంలో ఇచ్చిన ఆలోచించండి, చర్చించండి, మీకు తెలుసా? వంటి అనుబంధ శీర్షికల్లోని ప్రశ్నలు, అంశాలపై చర్చించడానికి సందేహించవద్దు.  ఈ పాఠ్యపుస్తకం పూర్తిగా కృత్యాధారితం.  ప్రయోగాలు, ప్రాజెక్ట్, జట్టు కృత్యాల్లో పాల్గొంటే సబ్జెక్ట్‌ను చక్కగా నేర్చుకోవచ్చు.
 -ఎస్.వి. సుధాకర్
 
 సాంఘిక శాస్త్రం
 గతంలో సాంఘిక శాస్త్రం   జాగ్రిఫీ, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే భాగాలుగా ఉండేది. కానీ నూతన విధానంలో రెండు భాగాలుగా చేసి మొత్తం 22 చాప్టర్లను చేర్చారు. అవి..భాగం-1 (వనరులు-అభివృద్ధి, సమానత: 1-12 చాప్టర్లు): ఇందులో భారతదేశ భౌగోళిక పరిస్థితులు, శోతోష్ణస్థితి, నదులు-నీటిపారుదల వ్యవస్థ, జనాభా, వ్యవసాయం-పంటలు-ఆహార భద్రతల గురించి చర్చించారు. ఇదే భాగంలో అర్థశాస్త్ర భావనలైన స్థూల జాతీయోత్పత్తి, జాతీయ/తలసరి ఆదాయం, ఉపాధి-ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం-ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి అంశాలను చేర్చారు.
 భాగం-2 (సమకాలీన ప్రపంచం, భారతదేశం: 13 నుంచి 22 చాప్టర్లు): చరిత్ర పాఠ్యాంశాలైన ఆధునిక ప్రపంచ చరిత్ర (క్రీ.శ. 1900-1950 వరకు), వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు, భారత స్వాతంత్రోత్యమ ఘట్టాలను పేర్కొన్నారు. వీటితోపాటు పౌరశాస్త్ర అంశాలు..భారత రాజ్యాంగ నిర్మాణం, 30 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం(క్రీ.శ.1947 -1977వరకు),
 
 దేశంలో వివిధ రాజకీయ ధోరణు లు(క్రీ.శ.1977-2000 వరకు), విదేశాలతో భారత సంబంధాలు, భారతదేశంలో సమకాలీన సామాజిక ఉద్యమాలు, సమాచార హక్కు చట్టం- న్యాయ సేవ ప్రాధికార సంస్థ గురించి వివరించారు.నూతన సిలబస్ వివరణాత్మకంగా విద్యార్థి నిజ జీవితానికి దగ్గరగా ఉంది. ప్రతి పాఠ్యాంశం చివర ఉన్న కీలక పదాల నిర్వచనాలను, ప్రత్యేక దృష్టితో చదవాలి. సమాచార సేకరణ/ప్రాజెక్ట్ పనిని స్వతంత్రంగా, నిబద్ధతతో నిర్వహించాలి. సమకాలీన అంశాలపై అవగాహనకు  ప్రతిరోజు దినపత్రికలను చదవాలి. పాఠ్యాంశం చివర్లో ఉన్న ప్రశ్నలకు స్వతంత్రంగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
 -బి. శ్రీనివాస్
 
 

మరిన్ని వార్తలు