‘కళ్యాణి’ నగర నిర్మాత ఎవరు?

29 Oct, 2014 04:55 IST|Sakshi

 వేములవాడ చాళుక్య రాజు ఒకటో వినమాదిత్య
 యుద్ధమల్లుడి మనువడైన మొదటి నరసింహవర్మ
 వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయాన్ని
 నిర్మించాడని దేవాలయ ప్రాంగణంలోని శాసనాల
 ద్వారా తెలుస్తోంది. వేములవాడలోనే ఉన్న మరో
 దేవాలయం ‘భీమేశ్వరాలయం’. ఇది బదేగేశ్వర
 దేవాలయమని, దీన్ని ‘బద్దేగ’ అనే రాజు
 (క్రీ.శ. 850 - 895) నిర్మించాడని అక్కడి
 శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. కళ్యాణీ
 చాళుక్య రాజైన రాజాదిత్య క్రీ.శ. 1083లో
 వేయించిన శాసనంలో వేములవాడ
 చాళుక్యుల ప్రస్తావన ఉంది.

 
చాళుక్యులు
శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలన్నింటిలో సుప్రసిద్ధమైంది చాళుక్యవంశం. వీరు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు పాలించారు. వీరు వాకాటకులకు సామంతులుగా ఉండేవారు. స్వతంత్రులై మొదట బీజాపూర్ (కర్ణాటక) ప్రాంతాన్ని పాలించారు. వీరి రాజధాని బీజాపూర్‌లోని ‘బాదామి’. అందువల్ల వీరిని బాదామి చాళుక్యులని, పశ్చిమ చాళుక్యులని పిలుస్తారు. వీరి వంశ స్థాపకుడు ‘జయసింహ వల్లభుడు’. వీరు నవీన పల్లవులకు సమకాలీకులు.

బాదామి చాళుక్యుల్లో ప్రముఖుడు రెండో పులకేశి. ఇతడు దక్షిణాపథంలో హర్షవర్ధనుడి జైత్రయాత్రను అడ్డుకున్నాడు. నర్మదానది ఒడ్డున హర్షవర్ధనుడిని ఓడించి, ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. పల్లవ మహేంద్ర వర్మను కూడా ఓడించాడు. ఇతడు వేంగీ ప్రాంతాన్ని జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనున్ని దానికి రాజుగా చేశాడు. రెండో పులకేశి కాలంలో హ్యూయాన్‌త్సాంగ్ చాళుక్యరాజ్యాన్ని (క్రీ.శ. 640 - 641) సందర్శించాడు. శాతవాహన వంశానికి చెందిన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణా పథాన్ని పూర్తిగా జయించి, పాలించిన మొదటి సార్వభౌముడిగా రెండో పులకేశి కీర్తిపొందాడు.

ఇతడి విజయాలను ప్రముఖ జైన పండితుడైన ‘రవికీర్తి’ ఐహోల్ శాసనంలో వివరించాడు. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ ఇతడితో దౌత్య సంబంధాలను పెట్టుకున్నట్టుగా ఆధారాలున్నాయి. మణిమంగళ యుద్ధంలో పల్లవ మొదటి నరసింహవర్మ చేతిలో పులకేశి ఓడిపోయి మరణించాడు. ఈ పరాజయంతో చాళుక్యరాజ్యం చిన్నాభిన్నమైంది. వీరిలో చివరి రాజు రెండో కీర్తివర్మ. ఇతడు రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడి చేతిలో ఓడిపోవడం వల్ల చాళుక్య వంశం పతనమైంది.

రెండో పులకేశి మరణం తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర రాజుగా వేంగీచాళుక్య వంశ పాలనను ప్రారంభించాడు. వీరినే తూర్పు చాళుక్యులు అని కూడా అంటారు. అదేవిధంగా కళ్యాణి ప్రాంతంలో కళ్యాణి చాళుక్యులు, వేములవాడ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు స్వతంత్ర రాజులుగా చెలామణిలోకి వచ్చారు. ఐహోల్, పట్టడగల్, బాదామి, ఆలంపూర్‌లోని దేవాలయాలు బాదామి చాళుక్యుల కాలంనాటివే. హరిహర, త్రిలోకేశ్వర, విజయేశ్వర, విరూపాక్ష, స్వర్గబ్రహ్మ దేవాలయాలు వారి వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి మంచి నిదర్శనాలు. అజంతా కుడ్యచిత్రాలు, శ్రావణ బెళగోళా (కర్ణాటక)లో అతి పెద్ద గోమఠేశ్వర విగ్ర హం వీరి కాలం నాటివే.
 క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించిన వేంగీ చాళుక్యుల్లో ఒకరైన చాళుక్య భీముడు ద్రాక్షారామం, భీమవరం, చేబ్రోలులో భీమేశ్వరాలయాలను నిర్మించాడు.

అమరావతిలోని అమరేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీర రామేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం వీరి కాలం నాటివే. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి ‘నన్నయ బట్టారకుడు’ మహాభారతాన్ని తెలుగులో రెండున్నర పర్వాలు (ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో కొంతభాగం) అనువదించాడు.  ఈ విషయంలో నన్నయ్యకు కన్నడ కవి నారాయణబట్టు సహాయపడ్డారు. నన్నయ్య ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే మొదటి వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ త్రయం (పంప, రన్న, పొన్న) లో మొదటివాడైన ‘పంపకవి’ ఉండేవాడు.

కొన్ని గ్రామాల సముదాయాన్ని ‘విషయం’ అని, కొన్ని విషయాలను ‘నాడులు’ అని, కొన్ని నాడులను‘మండలం’ అని వ్యవహరించేవారు. గ్రామాలను ‘గ్రామేమక’ అనే అధికారులు పర్యవేక్షించేవారు. మాడ, గద్య, చిన్న అనే నాణేలు వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామాలను ‘అగ్రహారాలు’ అనేవారు. దేవాలయాలకు అనుబంధంగా ఉండే విద్యా సంస్థలను ‘ఘటికలు’ అని పిలిచేవారు. ప్రధానంగా వేంగీ చాళుక్యుల కాలంలోనే తెలుగు సాహిత్యం ఆవిర్భవించి,  గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు దీనికి ఆద్యుడు.
 
వేములవాడ చాళుక్యులు
వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటరాజులకు సామంతులుగా ఉండేవారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘వేములవాడ’ రాజధానిగా వీరు పాలించారు. క్రీ.శ. 750 నుంచి 975 వరకు సుమారు 200 ఏళ్లు పాలించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. వీరికి సంబంధించి పూర్తి ఆధారాలు లేవు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేంద్రంగా ముదిగొండ చాళుక్యులు కొంతకాలం పాలించారని వేంగీచాళుక్యుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ముదిగొండ చాళుక్యులు వేంగీ చాళుక్యులకు సామంతులుగానే పాలించారు. వీరు స్వతంత్ర రాజులు కారని ముదిగొండ శాసనం తెలియజేస్తోంది.
 
మాదిరి ప్రశ్నలు
 1.    రెండో పులకేశి, పల్లవ మహేంద్ర వర్మను ఎక్కడ జరిగిన యుద్ధంలో ఓడించాడు?
     1) మణిమంగళ    2) హలేబీడు
     3) పుల్లలూర్    4) రాయదుర్గ
 2.    బాదామి చాళుక్యుల మూల పురుషుడు?
     1) జయసింహ వల్లభుడు    2) పులకేశి3) యుద్ధమల్లుడు      4) దంతిదుర్గుడు
 3.    ‘ఐహోలు’ శాసనకర్త?
     1) కీర్తివర్మ    2) రాజా సింహ
     3) రవికీర్తీ    4) పులకేశి
 4.    ఐహోలు శాసనం ఏ రాజు గురించి వివరిస్తోంది?
     1) మొదటి పులకేశి      2) రెండో పులకేశి
     3) కుబ్జ విష్ణువర్ధనుడు
     4) విక్రమాదిత్యుడు
 5.    రెండో పులకేశి పాలనాకాలంలో అతడి రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?
     1) పాహీయాన్    2) ఇత్సింగ్
     3) రెండో ఖుస్రూ  4) హ్యూయాన్‌త్సాంగ్
 6.    వాతాపి (బాదామి) నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన చాళుక్యరాజు?
     1) రెండో పులకేశి    2) మొదటి కీర్తివర్మ
     3) మొదటి విజయాదిత్య
     4) మంగలేశుడు
 7.    పశ్చిమ చాళుక్యుల్లో ప్రముఖ రాజు?
     1) జయసింహవల్లభుడు   2) కీర్తివర్మ
     3) నరసింహవర్మ     4) రెండో పులకేశి
 8.    ఎవరిని ఓడించడం వల్ల రెండో పులకేశి ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు?
     1) నరసింహవర్మ    2) మహేంద్రవర్మ
     3) హర్షవర్ధనుడు    4) శ్రీకృష్ణుడు
 9.    ‘వాతాపికొండ’ బిరుదు ఎవరిది?
     1) చాళుక్య కీర్తివర్మ
     2) చాళుక్య రెండో పులకేశి
     3) పల్లవ మహేంద్రవర్మ
     4) పల్లవ నరసింహవర్మ
 10.    {పాచీన భారతదేశ, మధ్యయుగ భారతదేశ చరిత్రకు మధ్య సంధి యుగంగా ఎవరి పాలనా కాలాన్ని భావిస్తారు?
     1) పల్లవులు    2) చాళుక్యులు
     3) రాష్ట్రకూటులు    4) గుప్తులు
 11.    కళ్యాణి చాళుక్యుల రాజ్యస్థాపకుడు?
     1) రెండో తైలపుడు
     2) మొదటి సోమేశ్వరుడు
     3) రెండో పులకేశి
     4) రెండో జయసింహవల్లభుడు
 12.    కళ్యాణి చాళుక్యుల రాజధాని?
     1) వెంగీ    2) వాతాపి
     3) మాన్యఖేతం    4) ధాన్యకటకం
 13.    ‘కళ్యాణి’ నగర నిర్మాత?
     1) రెండో తైలపుడు    2) సత్యాశ్రయుడు
     3) మొదటి సోమేశ్వరుడు
     4) మొదటి విక్రమాదిత్యుడు
 14.    కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన మొదటి సోమేశ్వరుడి అనుమతితో ‘హనుమకొండ’ కు స్వతంత్ర రాజైన కాకతీయ రాజు?
     1) మొదటి ప్రోలరాజు
     2) కాకర్త్య గండన
     3) మొదటి ప్రతాపరుద్రుడు
     4) మొదటి బేతరాజు
 15.    ‘విక్రమాంకదేవచరిత్ర’ను రచించింది?
     1) రవికీర్తి    2) బిల్హణుడు
     3) నాగార్జునుడు    4) కాళీదాసు
 16.    వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించినవారు?
     1) నరసింహవర్మ    2) మహేంద్రవర్మ
     3) మొదటి రాజాదిత్య
     4) మొదటి యుద్ధమల్ల
 17.    వేములవాడ చాళుక్యుల ఆస్థాన కవి?
     1) బాణబట్టుడు    2) నన్నెచోడుడు
     3) బిల్హణుడు    4) పంప
 18.    హర్షవర్ధనుడి ఆస్థాన కవి?
     1) కాళీదాసు    2) బాణుడు
     3) నారాయణబట్టు
     4) పాల్కురికి సోమనాథుడు
 19.    పుష్యభూతి వంశస్థుల ప్రథమ రాజధాని?
     1) స్థానేశ్వర్    2) కనోజ్
     2) బీజాపూర్    4) పాటలీపుత్రం
 
 సమాధానాలు
 1) 3;    2) 1;    3) 3;    4) 2;
 5) 4;    6) 2;    7) 4;    8) 3;
 9) 4;    10) 2;    11) 1;    12) 3;
 13) 3;    14) 1;    15) 2;    16) 1;
 17) 4;    18) 2;    19) 1.

మరిన్ని వార్తలు