వికాస్‌ రావుకు కాకుండా తుల ఉమాకు టికెట్‌ ఎలా ఇస్తారు? బీజేపీ ఆఫీస్‌ వద్ద కార్యకర్త అత్మహత్యాయత్నం

8 Nov, 2023 10:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేములవాడ టికెట్ కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌ రావు కుమారుడు వికాస్ రావుకు కాకుండా, తుల ఉమకు ఎలా ఇస్తారని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కచ్చితంగా బీజేపి టికెట్ వికాస్ రావుకి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు.

పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో యువకుడికి స్వల్ప గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు.

అయితే వేములవాడ బీజేపీ టికెట్ వికాస్‌కు ఇచ్చే వరకు వెళ్ళేది లేదని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. వికాస్‌రావు మద్దతుదారులతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు.

కాగా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగో విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను బీజేపీ  విడుదల చేసింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను బుధవారం ప్రకటించాల్సి ఉంది.

బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. 
చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్‌–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్‌ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్‌– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్‌– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్‌ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌. 

మరిన్ని వార్తలు